పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ ప్రాంగణం రణరంగంలా మారింది. ఎన్టీపీసీ యాజమాన్యం ఇచ్చిన ఒప్పందాన్ని అమలుచేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న క్రమంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు రెండోనెంబర్ గేట్ వద్ద అడ్డుకున్నారు. ఈక్రమంలో కార్మికులు- సీఐఎస్ఎఫ్ సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకుంది. కార్మికులను చెదరగొట్టేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీఛార్జీ చేశారు.
ఆ ఘటనలో కార్మిక సంఘం నేతతో పాటు 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు.. ఒప్పంద కార్మికులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఎన్టీపీసీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లాఠీఛార్జి చేసిన సిబ్బందిపై చర్యలు చేపట్టడం సహా యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.