ఇమేజ్​ను పక్కనపెట్టి చిరు మాత్రమే చేసిన ఆ సాహసాలు ఏంటంటే?

-

కెరీర్​ ప్రారంభ దశలో ఏ నటుడైనా ఎలాంటి ప్రాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటాడు. అలా ఏదో ఒక పాత్రతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోతాడు. మెగాస్టార్‌ చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. అయితే విపరీతమైన క్రేజ్‌ సంపాదించిన ఆయన చిరంజీవి విషయంలో అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. నేడు చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన కొన్ని సాహసాలను గుర్తుచేసుకుందాం.

సాధారణంగా స్టార్ హీరోలు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. మూడు ఫైట్లు, ఆరు పాటలు, ఉర్రూతలూగించే డ్యాన్స్‌ స్టెప్పులు వంటి కమర్షియల్​ కథతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్​ మారింది. ప్రయోగాత్మక చిత్రాలకు సై అంటున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాత్మక ప్రాజెక్ట్​లను మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్​లో చాలానే చేశారు. నేడు చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేసిన కొన్ని సాహసాలను గుర్తుచేసుకుందాం.

‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి సంచలన హీరోగా మారారు. యాక్షన్‌, డ్యాన్స్‌, నటన.. ఇలా అన్నింటిలోనూ కొత్త ఒరవడి సృష్టించారు. ఫక్తు కమర్షియల్‌ హంగులున్న కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. మరి, అలాంటి హీరో పూర్తిస్థాయి కామెడీ చిత్రంలో కనిపిస్తాడని ఎవరైనా ఊహిస్తారా? ‘చంటబ్బాయ్‌’ సినిమాని చిరంజీవి చేసిన తొలి ప్రయోగం అని చెప్పొచ్చు. డిటెక్టివ్‌ జేమ్స్‌ పాండ్‌ అనే ఆద్యంతం నవ్వులు పంచే పాత్రలో ఒదిగిపోయి విజయం అందుకున్నారు. ఈ సినిమాకి జంధ్యాల దర్శకత్వం వహించారు.

సాంబయ్య అనే వ్యక్తి తెగిపోయిన చెప్పులు కుడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఎంతో కష్టపడి పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు. ఎక్కిన మెట్టుని, వచ్చిన దారిని అసహ్యించుకునే వారసుడికి బుద్ధి చెప్తాడు. స్వయంకృషితో ఎలా ఎదగాలో నేర్పుతాడు. ఇదీ ‘స్వయంకృషి’ సినిమా బేస్‌ పాయింట్‌. చెప్పులు కుట్టుకునే పాత్ర అయినా చిరంజీవి వెనకడుగు వేయలేదు. సాంబయ్య అనే క్యారెక్టర్‌లో తనని తాను ఊహించుకుని నటించారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని, ఉత్తమ నటుడిగా ‘నంది’ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రానికి కె. విశ్వనాథ్‌ దర్శకుడు.

చిరంజీవిలోని కొత్త కోణాన్ని చూపించిన మరో చిత్రం ‘రుద్రవీణ’. సూర్యం అలియాస్ సూర్యనారాయణ శాస్త్రి (చిరంజీవి).. సంగీత విద్వాంసుడు గణపతి శాస్త్రి రెండో కొడుకు. ఇద్దరివి వేర్వేరు భావాలు. తండ్రి మాట వినకుండా సామాజిక రుగ్మతలను తొలగించాలనే తపనతో ఉంటాడు సూర్యం. చివరకు ఇల్లు విడిచి సమాజ సేవకు పూనుకుంటాడు. ప్రధానమంత్రి మెప్పుపొందుతాడు. దాంతో తన కొడుకే కరెక్ట్‌ అని గణపతి శాస్త్రి భావోద్వేగానికి లోనవుతాడు. ఇలాంటి సున్నితమైన కథకి చిరంజీవి న్యాయం చేయగలరా? ప్రేక్షకులు ఆయన్ను ఆ పాత్రలో అంగీకరిస్తారా? ఇవేవీ పట్టించుకోకుండా దర్శకుడు కె. బాలచందర్‌ తన కథకి హీరోగా చిరంజీవిని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో నటించి చిరంజీవి ఎందరిలోనో స్ఫూర్తి నింపారు. ఈ సినిమాలోని పాత్రకు ఆయన ‘నంది’ స్పెషల్‌ జ్యూరీ అవార్డు పొందారు.

‘స్వయంకృషి’తో సూపర్‌ హిట్‌ కాంబోగా నిలిచిన చిరంజీవి- కె. విశ్వనాథ్‌ కలిసి చేసిన మరో చిత్రం ‘ఆపద్బాంధవుడు’. ఆ చిత్రంలోని హీరో స్వయంకృషితో చెప్పుకుట్టే స్థాయి నుంచి మంచి బిజినెస్‌మ్యాన్‌గా ఎదిగితే ఇందులో పశువుల కాపరి అయిన కథానాయకుడు కొందరికి ఆపద్బాంధవుడు అవుతాడు. తనకు తెలిసిన ఉపాధ్యాయుడు రాసిన కవితలను ప్రచురించేందుకు పశువుల కాపరి అయిన మాధవుడు (చిరంజీవి) తన పశువుల్ని అమ్మేయటం.. అత్యాచారానికి గురవటంతో మతిస్థిమితం కోల్పోయిన ఆ ఉపాధ్యాయుడి కూతురిని మామూలు మనిషిని చేసేందుకు ఎన్నో బాధలు పడటం.. తదితర అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలోని చిరంజీవి నటనకు ‘నంది’, ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డులు వరించాయి.

చిరంజీవి కెరీర్‌లో ఇప్పటి వరకూ ప్రస్తావించిన పాత్రలు ఒకెత్తు.. ‘శ్రీ మంజునాథ’లో శివుడిగా నటించటం మరో ఎత్తు. అప్పటికే ఎంతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న చిరు ఈ పాత్ర పోషించటం విశేషం. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడు.

ఎప్పటికయినా స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత గాథల్లో నటించాలనేది చిరంజీవి చిరకాల వాంఛ. ‘సైరా నరసహింహారెడ్డి’ చిత్రంతో ఆ కోరిక తీరింది. బ్రిటిషు దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. రేనాటి సూర్యుడిగా అప్పటి ప్రజలంతా కీర్తించిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు నట విశ్వరూపం చూపారు. ఈ చిత్రం ద్వారా.. చిరంజీవిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుల జాబితాలో సురేందర్‌ రెడ్డి చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news