కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు జనాలు హడలిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న మా జీవితాల్లోకి ఈ దరిద్రం ఏంటి రా బాబూ అని ప్రతీ ఒక్కరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా కరోనా మాత్రం ఆగడం లేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ కి సంబంధించిన కొత్త లక్షణాలు బయటపడ్డాయి.
ఇప్పటి వరకు కరోనా లక్షణాలు అంటే, జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ళ నొప్పులు, తల నొప్పులు మాత్రమే చెప్పే వారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. కొత్త లక్షణాలు కూడా బయటపడ్డాయి. కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుందని, విరోచనాలు కూడా అవుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అసలు కరోనా లక్షణాలు ముందు ఏది బయటపడుతుందో చెప్పలేమని కూడా చెప్తున్నారు.
జర్మన్ వైద్య నిపుణులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు మొదట జ్వరం వస్తుందని, ఇంతేకాకుండా, అలసట, కండరాల నొప్పులు, పొడి దగ్గు తదితర లక్షణాలు గుర్తించారు. వీటిల్లో ఏది కనపడినా సరే… వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మూడు లక్షలకు చేరడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.