సమయానికి స్పందించడం మానేసి..ఇప్పుడు సమీక్షలు చేయడం వల్ల ఒరిగేది ఏమిటో.. చంద్రబాబు చెప్పాలంటున్నారు టీడీపీ కర్నూలు నాయకులు. స్థానిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో చాలా చోట్ల టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. దీంతో వైసీపీ నేతలు విజృంభించారు. నిజానికి ఈ సమయంలో కీలక నాయకులు పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, దీంతో వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన డోన్ నియోజకవర్గంలోనూ చాలా మేరకు స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం సాధించింది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, ఈ స్థానికంలో ఆయన పెద్దగా తెరమీదికి రాకపోయినా.. తెరవెనుక నుంచి మంత్రాంగం నడిపించారు.
దీంతో ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు వెనక్కితగ్గాయి. పైగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కారణంగా కూడా వైసీపీ నేతలు ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపించగా, టీడీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గారు. పోనీ.. ఈ ఆర్డినెన్స్ కారణంగా.. ప్రతిపక్షాల నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదా? అంటే అలా జరగలేదు. సీపీఐ, సీపీఎం నాయకులు ఎక్కడికక్కడ బాగానే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఎటొచ్చీ.. టీడీపీ నుంచి మాత్రం నామమాత్రంగా కొన్ని చోట్ల అసలు పోటీకి కూడా దూరంగా ఉన్నారు.
ఈ పరిణామాలతో డోన్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ టీడీపీ కనిపించలేదు. కేవలం 10 వార్డులకు మాత్రమే నామినేష న్లు వేశారు. మిగిలిన చోట్ల వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. అంతేకాదు, ఎన్నికలకు ముందుగానే డోన్ మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్య క్షుడు సోమిశెట్టి వెంకటే శ్వర్లు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌తో కలిసి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ పరిణామం పై అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు మౌనం వహించారు. అసలు డోన్‌లో ఇలా ఎందుకు ప్రకటించారనే విషయాన్ని కూడా ఆయ న పట్టించుకోలేదు. అదేసమయంలో చాలా వార్డుల్లో సీపీఐ పోటీకి దిగింది.
ఈ పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కళ్లు తెరిచారు. డోన్‌లో ఎందుకు ఇలా జరిగిందన్న దానిపై చంద్రబాబు ఆరా తీశారు. ముఖ్యంగా కేఈ కుటుంబం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటనపై ఇప్పుడు ఆలస్యంగా ఆయన స్పందించారు. దీంతో కర్నూలు టీడీపీ నాయకులు చేతులు కాలిపోయాక ఇప్పుడు స్పందిస్తే.. ఏంటి ప్రయోజనం అంటూ.. చంద్రబాబుపై ఫైరవుతున్నారు. నిజమే కదా!? ఇప్పుడు స్పందించి ఏం చేస్తారో చూడాలి.