కరోనాతో బాధపడుతున్నపుడు ఎక్సర్ సైజ్ చేయకూడదా..

-

వ్యాయామం ఒంటికి మంచిదని ప్రతీ ఒక్కరికీ తెలుసు. రోజులో 30 నుండి 45నిమిషాల పాటు వ్యాయామం చేస్తే రక్తప్రసరణ సరిగ్గా జరిగి, గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు. నిత్యజీవితంలో వ్యాయామం కూడా ఒక భాగం అవ్వాలని వింటుంటాం. ఐతే కరోనా సోకిన వాళ్ళు వ్యాయామం చేయకూడదని తాజా అధ్యయనం వెల్లడించింది.

కరోనాతో పోరాడుతున్న వాళ్ళు వ్యాయామం చేయకూడదట. మితంగా అయినా సరే వ్యాయామానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. కరోనా వచ్చిందని తెలిసినప్పటి నుండి వ్యాయామం చేయకుండా ఉంటే బెటర్ అని అంటున్నారు. దీనికి గల కారణాలని చెబుతూ, కరోనా సోకిన వారు వ్యాయామం చేస్తే గుండె వేగం పెరుగుతుందట. తద్వారా గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా గుండెకి సంబంధించిన కండరాల్లో వాపు వస్తుందట.

అంతే కాదు వ్యాయామం కరోనా లక్షణాలని ఎక్కువ చేస్తుందట. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిని మరింత ఎక్కువ చేస్తుందట. ఈ మేరకు వందమంది కరోనాని జయించిన వారిపై జరిపిన అధ్యయనంలో ఇలాంటి విషయాలని కనుగొన్నారు. ఆ వందమందిలో సగం మందికి లక్షణాలు తక్కువగానే ఉన్నాయట. ఇంకా 18శాతం మందికి అసలు లక్షణాలే లేవట. వీరందరి మీద ఎమ్ ఆర్ ఐ టెస్టులు జరిపిన బృందం కొత్త విషయాన్ని కనుక్కొంది. వీరందరిలో 78 మందికి గుండె నిర్మాణంలో మార్పులు చోటు చేసుకున్నాయట. ఇంకా 60మందిలో గుండె కండరాలు వాపుకి గురయ్యాయట.

అందువల్ల కరోనాతో బాధపడుతున్న వారు ఎక్సర్ సైజ్ చేయకపోవడమే ఉత్తమమని అంటున్నారు. ఐతే కరోనా తగ్గాక నాలుగు వారాల తర్వాతే వ్యాయామం ప్రారంభించాలట. అది కూడా మెల్లగా మొదలు పెట్టి వేగవంతం చేయాలని, ఒకేసారి స్పీడ్ అప్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news