చైనాలో 2019లో మొదలైన ఫ్లూ లాంటి వ్యాధి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. సమస్త మానవజాతి ఉనికికే కోవిడ్ 19 ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. ఖండాలను దాటి వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ రూపంలో భారత్‌ను కుదిపేస్తోంది.
భారత్‌లో ఫిబ్రవరి 15వ తేదీన 9,139 కోవిడ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కానీ అదే నెల నుంచి క్రమంగా రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. తరువాత మార్చి, ఆ తరువాత ఏప్రిల్ నెలల్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఓ దశలో ఒక్క రోజులోనే 1.60 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఏప్రిల్ 11వ తేదీన అత్యధిక మరణాలు సంభవించాయి. 900 మందికి పైగా చనిపోయారు. అక్టోబర్ 17 తరువాత ఆ స్థాయిలో చనిపోవడం మళ్లీ ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే దేశంలో లాక్‌డౌన్ విధించడం ఒక్కటే కోవిడ్ సెకండ్ వేవ్‌ను అడ్డుకునేందుకు మార్గం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇది థర్డ్ వేవ్‌ను అడ్డుకుంటుందని, కానీ ప్రస్తుతం ఉన్న సెకండ్ వేవ్‌ను మాత్రం అడ్డుకోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకనే రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్‌ను విధించాలన్న ఆలోచన చేస్తున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడంపై ఏప్రిల్ 14వ తేదీ తరువాత నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అలాగే కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప కూడా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగితే లాక్‌డౌన్ విధించడంపై ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. ఇక బెంగళూరులో 75 శాతానికి పైగా కోవిడ్ బెడ్స్ నిండిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే రాష్ట్రాలు కొన్ని నగరాలు, పట్టణాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ను విధించాయి. కానీ సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయడం లేదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌లు తమ తమ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని తెలిపారు. కానీ ముందు ముందు ఇంకా కేసుల సంఖ్య పెరిగితే అప్పుడు వారు ఏం చేస్తారు ? ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? లాక్‌డౌన్ ను విధిస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగితే రాష్ట్రాలైనా లాక్‌డౌన్ విధించక తప్పదు. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.