39 మంది పిల్లలకు ఒకే సిరంజితో కరోనా టీకా

-

ఓ పాఠశాలలో 39 మంది విద్యార్థులకు ఒకే సిరంజితో కరోనా టీకా వేశాడు ఓ ప్రబుద్ధుడు. గమనించిన తల్లిదండ్రులు ఈ విషయం గురించి నిలదీయగా అక్కణ్నించి పరారయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సాగర్​లోని జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్​లో బుధవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. 15 ఏళ్లు వయసు పైబడిన 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కరోనా టీకాలు వేశారు. అయితే.. టీకాలు వేస్తున్న జితేంద్ర అహిర్వార్.. అందరికీ ఒకే సిరంజీ వాడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించారు. ఇదేంటంటూ వారంతా నిరసనకు దిగారు.

పాఠశాలలో తల్లిదండ్రుల నిరసన గురించి జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ క్షితిజ్ సింఘాల్​కు తెలిసింది. వెంటనే ఆయన జిల్లా చీఫ్​ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎంహెచ్​ఓ) డాక్టర్ డీకే గోస్వామిని బడికి పంపారు. ఈలోగా జితేంద్ర అక్కడి నుంచి పరారయ్యాడు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాగర్​ నగరంలోని గోపాల్ గంజ్ ఠాణాలో జితేంద్రపై ఐపీసీ 366 కింద కేసు నమోదైంది. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

సీఎంహెచ్​ఓ నివేదిక మేరకు శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. జిల్లా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ రాకేశ్​ రోషన్​పై చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. 39 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. 19 మందికి ఏ ఇబ్బందీ లేదని, మిగిలిన వారి వైద్య నివేదికలు రావాల్సి ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news