కరోనా మహమ్మారి కోరలు చాచింది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే లక్షల మంది ప్రజలు దీని బారిన పడగా, వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రజప్రతినిధులు సైతం ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని సూచించారు. అయితే ఇప్పుడు ఈ మహమ్మారి సెగ జైళ్లకు సైతం తాకింది. ఇప్పటికే దేశంలోని కొన్ని జైలల్లో కరోనా వ్యాపించింది. అలాగే ఇటీవల తిరుపతి సబ్ జైల్లో ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపుతోంది. ఓ కిడ్నాప్ కేసులో విజయవాడ జైలు నుండి రాజమండ్రి జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీకి ఆరోగ్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో జైలు సిబ్బంది, తోటి ఖైదీల్లో ఆందోళన నెలకొంది. కాగా ఆ నిందితుడిని ఆసుపత్రికి తరలించగా జైలును శానిటైజ్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక ఆ నిందితుడిని తీసుకువచ్చిన పోలీసులను క్వారంటైన్ చేశారు.