కోవిడ్ 19 గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. ఈ మేరకు సీడీసీ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ ఉన్న వారి నుంచి వెలువడే తుంపరలు గాలిలో కొన్నిగంటల వరకు అలాగే ఉంటాయని, వాటి వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీడీసీ సైంటిస్టులు తేల్చారు.
కాగా సీడీసీ గతంలో సరిగ్గా ఇలాంటి ప్రకటనే చేసింది. కానీ విమర్శలు రావడంతో అప్పటి తన ప్రకటనను వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పుడు కూడా అదే ప్రకటన చేయడం విశేషం. కాకపోతే గతంలో బహిరంగ ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని సీడీసీ చెప్పుకొచ్చింది. అందుకనే 6 అడుగుల రూల్‌ను పాటించాలని గతంలో సీడీసీ తెలిపింది. కోవిడ్ ఉన్నవారి నుంచి వెలువడే తుంపర్లు 6 అడుగుల దూరం వరకు వ్యాపిస్తాయని, కనుక కోవిడ్ రాకుండా ఉండాలంటే వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలని చెప్పింది. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ప్రకటించింది. కానీ ఇప్పుడు చెప్పిన విషయం ఇండ్లలో లేదా అలాంటి నిర్బంధమైన ప్రదేశాల్లో ఉండే వారికి వర్తిస్తుందని తెలిపింది.
కోవిడ్ ఉన్నవారు నిర్బంధమైన ప్రదేశాల్లో ఉంటే వారి నుంచి వెలువడే తుంపరలు ఆ ప్రాంతంలో కొన్ని గంటలపాటు ఉంటాయని, వాటిల్లో వైరస్ ఉంటుంది కనుక ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీడీసీ తెలియజేసింది. నిర్బంధమైన ప్రదేశాలు.. అంటే.. ఇండ్లు, ఆఫీసులు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో బయటి నుంచి లోపలికి గాలి ధారాళంగా వచ్చే ఏర్పాటు ఉండదు. కనుక అలాంటి ప్రదేశాల్లో కరోనా ఎక్కువ సేపు గాలిలో ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంలో ఆయా ప్రదేశాల్లో ఉండేవారికి, ఆయా ప్రదేశాలకు వెళ్లే వారికి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని సీడీసీ తెలియజేసింది. ఈ విషయంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.