వ్యాపార లావాదేవీల్లోనూ అవినీతే… గతంలో కన్నా దిగజారిన ఇండియా ర్యాంక్

ఇండియాలో అన్నిరంగాల్లో అవినీతి పేరుకుపోయింది. అవినీతి సర్వాంతర్యామిగా దేశాన్ని పట్టిపీడిస్తోంది. దేశంలో అవినీతిని అంతమొందిస్తామని సర్కార్ ఎన్ని మాటలు చెబుతున్నా వట్టి నీటిమూటలే అవుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో అవినీతి కట్టడి తీసికట్టుగా ఉందని తాజాగా ’ట్రెస్‘ నివేదిక వెల్లడించింది. ‘ట్రేస్‌ బ్రైబరీ రిస్క్‌ మ్యాట్రిక్స్‌’ వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం లంచాలు ఎక్కువగా ఇస్తున్న దేశాల్లో 2021లో మన దేశం 82వ స్థానంలో నిలిచింది. 194 దేశాల్లో అధ్యయనం చేయగా ఇండియా ఈ ర్యాంకులో నిలిచింది. గతేడాది 77 వ స్థానంలో నిలచిన ఇండియా ఈసారి ఐదు స్థానాలు దిగజారింది.

పాకిస్థాన్‌, చైనా, నేపాల్‌, బంగ్లాదేశ్‌లో వ్యాపార లావాదేవీల్లో అవినీతి ఇండియా కన్నా ఎక్కువగా ఉందని సదరు అధ్యయనం తెలిపింది. భారత్ కన్నా భూటాన్ మెరుగైన స్థానంలో ఉంది. ఈ దేశం 62 ర్యాంకులో నిలిచింది. గతేడాది ఇండియాకు 45 స్కోర్ ఉంటే ఈ ఏడాది 44 స్కోర్ సాధించింది. ఇండియాతో పాటు పెరూ, ఉత్తర మాసిడోనియా, మాంటెనీగ్రో దేశాలు కూడా 44 స్కోరుతో మన దేశంతో సమానంగా నిలిచాయి.

 

ముడుపుల ముప్పు అధికంగా ఉన్న దేశాలు.. ఉత్తరకొరియా, తుర్కిమెనిస్థాన్‌, వెనెజువెలా, ఎరిత్రియా

లంచాల తాకిడి తక్కువగా ఉన్న దేశాలు.. డెన్మార్క్‌, నార్వే, ఫిన్లాండ్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌.