దేశీయంగా తయారైన కోవాగ్జిన్ పై ప్రపంచ దేశాలు, చివరికి WHO కూడా అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వడానికి రోజుల తరబడి తాత్సారం చేసింది. తాజాగా కోవిడ్ వ్యాధిపై కోవాగ్జిన్ టీకా 77.8 సమర్థతను కలిగి ఉందని లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. కోవాగ్జిన్ ఫేజ్ 3ట్రయల్స్ ఫలితాల ఆధారంగా ఇది రుజువైంది. కోవాగ్జిన్ ను హైదరాబాద్ బెస్డ్ ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం కరోనా అన్ని వేరియంట్లపై కోవాగ్జిన్ టీకా 70.8 శాతం సమర్థతను కలిగి ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. అతి ప్రమాదకర వేరియంట్లలో ఒకటైన డెల్టా వేరియంట్ కు 65.2 శాతం, కప్పా వేరియంట్ కు 90 శాతం సమర్థతను కోవాగ్జిన్ కలిగిఉందని తేలింది.
లక్షణాలు ఎక్కువగా ఉన్న కరోనా బాధితులపై 93.4 శాతం కోవాగ్జిన్ సమర్థంగా పనిచేసిందని తేలింది. లక్షణాలు కనిపించని కరోనా బాధితులపై63.6 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనంలో తేలింది. దేశంలోని 25 నగరాల్లో దాదాపు 25800 మందిపై అధ్యయనం చేయగా.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బాడీలు వేగంగా పెరిగి ఎక్కువ కాలం రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడిందని తేలింది. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 12.4 శాతం మందిపై సాధారణ సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయని.. 0.5 మందిలో మాత్రమే తీవ్ర స్థాయి అనారోగ్య సమస్యలు వచ్చినట్లు తేలింది.
గత వారమే WHO సాంకేతిక సలహా గ్రూప్ కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. లాన్సెట్ నివేదికను పరిశీలిస్తే మేము ఎంత పారదర్శకంగా వ్యవహరించామో ప్రపంచ దేశాలకు తెలిసిందని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎల్లా అన్నారు.