ఎక్కడైనా రాజకీయాల్లో కోవర్టులు ఉండటం సహజమే. ఒక పార్టీలో ఉంటూ..ఆ పార్టీనే దెబ్బతీయడానికి చూస్తుంటారు. అలాగే వేరే పార్టీకి సహకరిస్తారు. అయితే ఈ కోవర్టుల బెడద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేసేవారు ఉన్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. అలాగే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారు కూడా ఉన్నారని విమర్శలు వచ్చాయి. ఇక ఈ కోవర్టుల బెడద బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో కూడా ఉన్నారు.
కాకపోతే అధిష్టానాలు స్ట్రాంగ్ గా ఉండటంతో కోవర్టులు తొందరగా బయటపడరు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అవకాశాలని బట్టి కోవర్టు రాజకీయాలు ఉంటాయి. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో కోవర్టుల కలకలం రేగింది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కోవర్టుల యాక్షన్స్ తన దగ్గర చెల్లవని, తాను ప్రెజెంట్ ఎమ్మెల్యేని… మాజీని కాదని, అతి వినయం దృష్ట లక్షణమని అన్నారు.
ఇక గమనించలేనంత పరిస్థితిలో తాను లేనని, ఎవరు ఎక్కడ ఎవరెవరితో ప్రత్యక్షం అవుతున్నారో అంతా తనకు తెలుసని, తన దగ్గర యాక్టింగ్ పనిచేయదని, కోవర్టులున్నారు జాగ్రత్త .. బీఆర్‌ఎస్ సైనికులు అప్రమత్తంగా చాకచక్యంగా వ్యవహరించండని రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన సొంత పార్టీలో ఉన్న నేతలని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఆ పార్టీలో ఉండే నేతలు..వేరే పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీకే టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కోవర్టు రాజకీయం వల్ల రేగాకే పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది. అందుకే ఆయన సొంత పార్టీలో ఉన్న కోవర్టులని ఉద్దేశించి మాట్లాడినట్లు సమాచారం. మరి చూడాలి ఈ కోవర్టు రాజకీయం కారుని ఎంతవరకు ముంచుతుందో.