కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం (01-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరోనా వల్ల క్రీడారంగం కూడా తీవ్రంగా నష్టపోయిందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలువురు క్రీడాకారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో కొత్త క్రీడా పాలసీపై ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.
2. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,275 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1,50,209కు చేరుకుంది. మొత్తం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1407 మంది చనిపోయారు.
3. రష్యా, చైనా దేశాలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను నమ్మలేమని అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్టులు ఆంథోని ఫాసీ అన్నారు. ఆయా దేశాలు ఎలాంటి టెస్టింగ్‌లు, ట్రయల్స్ లేకుండానే కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసే యత్నం చేస్తున్నాయని, అందువల్ల అది సమస్యలను తెచ్చి పెడుతుందని అన్నారు.
4. గచ్చిబౌలిలోని టిమ్స్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. రాష్ట్రానికి కేంద్రం 1200 వెంటిలేటర్లను పంపిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్ల పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని అన్నారు.
5. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లేవారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇతర రాష్ట్ర ప్రయాణికులు ఏపీలోకి వెళ్లేందుకు కావల్సిన అనుమతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ చేయాలని నిర్ణయించారు.
6. కరోనా ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గదని, దశాబ్దాల తరబడి దాని ప్రభావం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. గత 7 నెలల కింద కరోనా మహమ్మారి ప్రభావం ప్రభావం ప్రారంభమైందని, అది అంత సులభంగా తగ్గదని అన్నారు.
7. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2083 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. 17,754 మంది చికిత్స తీసుకుంటున్నారు. 46,502 మంది కోలుకున్నారు. 530 మంది చనిపోయారు.
8. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 57,117 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 764 మంది చనిపోయారు. 5,65,103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 10,94,374 మంది కోలుకున్నారు. మొత్తం 36,511 మంది చనిపోయారు.
9. ఆగస్టు 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్‌లాక్ 3.0 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 31వ తేదీ వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఇచ్చిన అన్ని మార్గదర్శకాలను ఇందులో భాగంగా అమలు చేయనున్నారు.
10. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క రోజులోనే అక్కడ 9601 కరోనా కేసులు నమోదు కాగా 322 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 4,31,719కు చేరుకోగా, 15,316 మంది చనిపోయారు. 2,66,883 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1,49,214 యాక్టివ్ కేసులు ఉన్నాయి.