కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆఫీసులలో కరోనా టీకాలు వేయడానికి అనుమతించబోతోంది. ఒకవేళ ఏ ప్రదేశంలోనైనా 100 మంది అర్హత కలిగిన వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉంటే, అక్కడ తాత్కాలిక కోవిడ్ టీకా కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది. దీనిని ఏప్రిల్ 11న ప్రారంభించాలని రాష్ట్రాలు / యుటిలకి ఆదేశాలు అందాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలో 100 మంది అర్హత గల, సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉంటే, కార్యాలయాన్ని కోవిడ్ టీకా కేంద్రంగా మారుస్తారు. ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయడం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్యాలయాల్లో ఈ వయస్సు గల 100 మంది వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారు ఉంటే, వారికి అక్కడ టీకాలు వేయనున్నారు.
ఈ కార్యాలయాలను ఎలా గుర్తిస్తారు ?
జిల్లా మేజిస్ట్రేట్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు మునిసిపల్ కమిషనర్ నేతృత్వంలోని అర్బన్ టాస్క్ ఫోర్స్ ఉద్యోగుల సంఖ్య మరియు అర్హత ఆధారంగా ఇటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలను గుర్తిస్తాయి. జిల్లా ఆరోగ్య పరిపాలన మరియు ప్రైవేటు కోవిడ్ టీకా కేంద్రాలతో సమన్వయం చేసుకోవడానికి కార్యాలయ నిర్వహణ సీనియర్ సిబ్బందిని నోడల్ అధికారిగా నియమిస్తుంది.