సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అరెస్టు

-

ఏపీలోని నంద్యాలలో జరిగిన సీపీఐ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేయాలన్న డిమాండ్లతో ఈ నెల 2న సీపీఐ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం పలువురు సీపీఐ నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

ఈ క్రమంలో నంద్యాలలో జరిగిన సమావేశానికి హాజరైన రామకృష్ణ హాజరవుతున్నారనే సమాచారంతో పోలీసులు కాపు కాశారు. సమావేశం నుంచి బయటికి రాగానే పోలీసులు చుట్టుముట్టారు. పక్కనే ఉన్న కార్యకర్తలు అడ్డుపడటంతో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీపీఐ నాయకులు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని రెండో పట్టణ ఠాణాకు తరలించారు.

రామకృష్ణను పోలీసు వాహనంలో స్థానిక సూరజ్‌ హోటల్‌కు తరలించి నిర్బంధించారు. అంతకుముందు స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పత్తికొండ, కర్నూలు తదితర కేంద్రాల్లో పలువురు సీపీఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news