ప్రత్యేక హోదా సాధన కోసం సమిష్టి పోరాటానికి సిద్దపడాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. విభజన హామీలు నేరవెర్చామంటూ కేంద్ర హోం శాఖ సహయ మంత్రి నిత్యానందరాయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఏపీ విషయంలో కేంద్రం అడుగడుగునా మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. వెనుకబడిన జిల్లాల నిధుల్లేవు.. కడప స్టీల్ ప్లాంట్ లేదు అంటూ ఆయన మండిపడ్డారు. జగన్ అధికారం చేపట్టాక కేంద్రంపై ఒత్తిడి పెంచడం మానేశారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా విభజన చట్టంలో చెప్పినట్టు కాకుండా. రామాయపట్నంలో చిన్న సైజు పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన మోడీపై ఒత్తిడి తేలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల గురించి పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలన్నారు రామకృష్ణ. రాజకీయ లబ్దికోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు.