తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటించి, ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శల పై స్పందించారు. వందే భారత్ రైలును ప్రారంభించిన నరేంద్ర మోడీ టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగ లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని విమర్శించారు. తక్షణం నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి హోదాలో వచ్చిన మోడీ బీజేపీ సమావేశంగా మార్చడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
బీజేపీ నేతగా సమావేశానికి వచ్చారా లేక ప్రధానిగా వచ్చారా సమాధానం చెప్పాలన్నారు. మోడీ ప్రసంగం మొత్తం తెలంగాణ ప్రభుత్వంపై దాడి చేసేలా సాగిందన్నారు. కేసీఆర్ బీజేపీకి అనుకూలంగా ఉన్న రోజుల్లో అవినీతి ఎందుకు కనబడలేదని, నేడు ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారని అడిగారు. తనకు జై కొట్టిన వారిని ఇళ్లకు పంపుతారని, జై కొట్టని వారిని జైలుకు పంపడం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తమిళనాడులో కుల ప్రస్తావనలను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. ప్రజల నుంచి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన డబ్బులు మోడీ ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు.