అర్ధరాత్రి గుప్త నిధుల తవ్వకాలు.. చితకబాదిన తండావాసులు

ఏదో ఒకచోట గుప్త నిధులు బయటపడిపోయాయని.. అన్నిచోట్ల గుప్త నిధులు ఉంటాయనుకోవడం బ్రమ. జనాలలో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని చాలా చోట్ల గుప్తనిధుల పేరుతో తవ్వకాలు చేస్తుంటారు మోసగాళ్లు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని.. అక్కడ తవ్వితే మీ దరిద్రం పోయి ధనవంతులుగా మారవచ్చని చెప్పి నమ్మబలుకుతారు. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నుస్తులాపూర్ తండాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

శనివారం రాత్రి గుప్త నిధుల కోసం భూ యజమానితో కలిసి తవ్వకాలు చేపట్టారు ఇద్దరు వ్యక్తులు. అయితే ఇది గమనించిన తండావాసులు రూప్లా నాయక్, శంకర్ నాయక్, సీతారాం నాయక్, శీను నాయక్, మోహన్ నాయక్ లు వారిని చితకబాదారు. అడ్డువచ్చిన భూ యాజమాని తులసి రామ్ నాయక్ ని అతని కుటుంబాన్ని సైతం చితకబాదారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన వాళ్లని మెరుగైన చికిత్స కోసం నగర ఆసుపత్రికి తరలించారు. పూజ స్థలంలో సామాగ్రిని, ధ్వంసం అయిన రెండు బైక్ లను, ఓ కారుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.