న్యాయం గెలిచింది.. నిందితుడికి తగిన శిక్ష పడింది.. ధర్మం మూడు పాదాలపైన నడుస్తున్న నేటి యుగంలోనూ ఇంకా న్యాయం బతికే ఉందని న్యాయవ్యవస్థ నిరూపించింది. కన్నూ మిన్నూ కానకుండా.. ఓ వ్యక్తి ముక్కు పచ్చలారని పసికందుపై అత్యాచారం, హత్య చేసినందుకు ఆ మృగానికి ఉరిశిక్ష పడింది.
న్యాయం గెలిచింది.. నిందితుడికి తగిన శిక్ష పడింది.. ధర్మం మూడు పాదాలపైన నడుస్తున్న నేటి యుగంలోనూ ఇంకా న్యాయం బతికే ఉందని న్యాయవ్యవస్థ నిరూపించింది. కన్నూ మిన్నూ కానకుండా.. ఓ వ్యక్తి ముక్కు పచ్చలారని పసికందుపై అత్యాచారం, హత్య చేసినందుకు ఆ మృగానికి ఉరిశిక్ష పడింది. ఘటన జరిగిన కేవలం 50 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడడంతో అందరూ ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే…
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కుటుంబం వేసవి సెలవులు కావడంతో జూన్‌లో హన్మకొండకు వచ్చింది. ఆ కుటుంబంలోని మహిళకు చెందిన తల్లి ఉండేది హన్మకొండ కావడంతో వారు జూన్ 16వ తేదీన హన్మకొండకు వచ్చారు. ఈ క్రమంలో ఆ మహిళకు ఓ కుమార్తె (9 నెలలు) ఉండగా.. ఆ కుటుంబమంతా కలిసి జూన్ 18వ తేదీన రాత్రి ఇంటి బంగ్లాపై పడుకుని నిద్రించారు. అయితే రాత్రి 2.30 గంటల సమయంలో నిద్రలేచిన ఆ మహిళకు తన కుమార్తె కనిపించ లేదు. దీంతో ఆందోళన చెందిన ఆ కుటుంబ సభ్యులు అందరూ చుట్టూ పరిసరాల్లో పసిపాప కోసం గాలించారు. అయినా పాప ఆచూకీ తెలియలేదు.
కాగా ఆ పాపను.. కుమార్‌పల్లి బొమ్మల వేపచెట్టు ప్రాంతంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం వసంత్‌పూర్‌కు చెందిన పోలెపాక ప్రవీణ్ టవల్‌లో చుట్టుకుని భుజాన వేసుకుని కనిపించాడు. దీంతో కొందరు ఆ యువకులు అతన్ని చూసి గుర్తు పట్టగా ప్రవీణ్ ఆ పాపను నేలకేసి కొట్టి పారిపోయేందుకు యత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కొందరు యువకులు ప్రవీణ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే ప్రవీణ్ ఆ పాపను నేలకేసి కొట్టడంతో ఆ పాపకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలో ఆ పసికందును హాస్పిటల్‌కు తరలించినా.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందిందని వైద్యులు నిర్దారించారు.
కాగా నిందితుడు ప్రవీణ్ హన్మకొండలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండగా.. ఆ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన అతను పాప నిద్రిస్తున్న ఇంటికి వెళ్లి 2 ఫోన్లను దొంగిలించాడు. అనంతరం బంగ్లాపై నిద్రిస్తున్న చిన్నారిని తీసుకుని సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కూడా ఆ చిన్నారిని ఎత్తుకుని తిరుగుతుండగా.. అతన్ని పట్టుకున్న యువకులు పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రవీణ్‌పై ఐపీసీ సెక్షన్లు 366, 302, 376ఎ, 376ఎ/బి, 379, 5 ఎం రెడ్‌విత్ 6 ఆఫ్ పోక్సో యాక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే పోలీసులు ఘటన జరిగిన 20 రోజుల్లోపే పూర్తి వివరాలను సేకరించి చార్జిషీటు దాఖలు చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం 50 రోజుల్లోనే నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష వేసింది. దీంతో బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగిందని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..!