వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నేరాల నియంత్రణపై దృష్టిపెట్టారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు వారి ఉచ్చులో పడకుండా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అనవసర లింక్‌లను క్లిక్ చేయడంతో కలిగే అనర్థాలు, నష్టాలపై వివరిస్తున్నారు. గుర్తుతెలియని, అపరిచిత వ్యక్తులతో ఫోన్‌కాల్స్, వాట్సాప్, ఫేస్‌బుక్, చాటింగ్‌కు దూరంగా ఉండాలని, ఓటీపీలు వస్తే ఎవరికీ చెప్పవద్దని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ మోసాల బారిన పడుతున్నారు. అలాంటి ఘటనే ఇది.. ముంబై పోలీసులమంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఇంజనీర్ దివ్యకు ముంబై పోలీసులకుంటూ ఫోన్ వచ్చింది. నీ మొబైల్ నెంబరు హవాలా లావాదేవీల్లో ఉందని ఆమెను బెదిరించి రూ.95,499 కొట్టేశారు. అనంతరం ఇంకా డబ్బు పంపించాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు ప్రజల డబ్బులు దోచుకుంటున్నారు.