తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే అలయ్ బలయ్ కార్యక్రమం 17 ఏళ్ల నుంచి సాగుతూ వస్తోంది. బీజేపీ నేత, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17 ఏళ్ల కిందట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది దసరా మరుసటిరోజు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు.
శత్రుత్వాన్ని తొలగించి స్నేహాన్ని పెంపొందించేలా రాజకీయ నేతలను ఏక తాటిపైకి తీసుకువచ్చే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల గవర్నర్లు, పంజాబ్, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, భూపేంద్ర యాదవ్ హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులైన మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కోదండారాం తదిదరులు పాల్గొననున్నారు.