వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడులో 14 మంది మరణించారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు ఏపీలోని నెల్లూర్, చిత్తూర్, కడప జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా వానలు కురుస్తున్నాయి. వానలతో తిరుపతి పట్టణం జలమయమైంది. వర్షాల ప్రభావంతో తిరుమల నడక దారిని అధికారులు మూసేశారు. నవంబర్ 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని తదుపరి 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది.
మరోవైపు వాయుగుండం ప్రభావం తెలంగాణ పై కూడా పడింది. రానున్న 24 నుంచి 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. “కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని చోట్ల రాబోయే 24 నుండి 48 గంటల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది” అని ఆమె చెప్పారు.