విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవించనున్నాయా ? ముఖ్యంగా తనకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని దూకుడుకు బ్రేకులు ఎదురు కానున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఎంపీగా ఉన్న నాని.. తన కుమార్తె కేశినేని శ్వేతను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. టీడీపీ తరఫున విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి పెట్టారు. అదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబును ఒప్పించి మరీ.. విజయవాడ మేయర్ స్థానాన్ని కూడా కేశినేని తన కుమార్తెకు ఇప్పించుకున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అయితే ఇదే మేయర్ పీఠం కోసం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గాలు కూడా కన్నేసి ఉన్నాయి.
ఇంత వరకుబాగానే ఉంది. తన పలుకుబడి, ఎంపీగా తాను చక్రం తిప్పడం వంటి పరిణామాలతో తన కుమార్తెను మేయర్ పీఠంపైకి ఎక్కించుకోగలనని నాని అనుకున్నారు. అయితే, మేయర్‌గా శ్వేత ఆ పీఠం దక్కించుకోవాలంటే.. ఇతర కార్పొరేట్ అభ్యర్థుల గెలుపుపైనే ఆధారపడి ఉంటుంది. మరి వీరు మాత్రం గెలవరా ? అంటే.. వీరి గెలుపంతా యూత్ పైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే.. గత ఐదేళ్ళతో పోల్చుకుంటే.. విజయవాడలో యూత్ ఓటర్లు పెరిగిపోయారు. వీరు ఎటుమొగ్గితే.. వారే గెలుపుగుర్రం ఎక్కుతారు. ఇక బెజవాడ కార్పొరేషన్ పరిధిలో యువత ఓట్లతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లను సులువుగానే టీడీపీ వైపునకు తిప్పుకుని మేయర్ పీఠం దక్కించుకోవచ్చని నిన్న మొన్నటి వరకు కేశినేని కలలు కన్నారు. అయితే ఇప్పుడు వాటికి పూర్తిగా గండిపడేలా ఉంది.
కేశినేని ఆశలు పెట్టుకున్న కమ్మ + వర్గం ఓట్లను దేవినేని అవినాష్ వైసీపీ వైపు టర్న్ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన యూత్‌ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్‌గా ఉన్న అవినాష్.. యువతలో దూసుకు పోతున్నారు. నగరంలో టీడీపీ గెలిచిన తూర్పులోనే ఇప్పుడు అవినాష్ ఎంట్రీతో కమ్మ ఓటర్లే కాదు… అన్ని వర్గాల్లో యువత అంతా ఆయన వైపు వచ్చేస్తున్నారు. తూర్పులో వైసీపీని బలోపేతం చేస్తుండడంతో పాటు తనకు పరిచయం ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలోనూ యూత్‌పై ప్రభావం చూపనున్నారు. ఇక పేదలకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో అవినాష్.. హవా యూత్‌లో ఓ రేంజ్‌లో ఉంది.
పైగా అవినాష్‌కు విజయవాడ కొట్టిన పిండి కావడం, తన తండ్రి దివంగత దేవినేని నెహ్రూ బలమైన అనుచరగణం, నాటి నాయకుల పిల్లలు కూడా తన వయస్కులే కావడంతో అవినాష్‌కు మద్దతు పెరుగుతోంది. దీంతో యూత్ ఓటింగ్ అంతా కూడా వైఎస్సార్ సీపీకే దక్కనుంది. ఇక, కేశినేని విషయాన్ని చూసుకుంటే.. ఆయనకు యూత్ మద్దతు లేదు. పైగా ఆయన కుమార్తె శ్వేతకు రాజకీయాలు కొత్త. దీంతో దేవినేని మేయర్ పీఠంపై తీవ్రప్రభావం చూపుతారని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో తూర్పులో ఎలాగూ టీడీపీ గెలిచింది కాబట్టి.. సెంట్రల్లోనూ కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఎలాగైనా మేయర్ పీఠం సొంతం చేసుకోవాలనుకున్న టీడీపీకి ఇప్పుడు ఈ రెండు చోట్లా అవినాష్ దూకుడు చెమటలు పట్టిస్తోందన్నదే ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో వినిపించే టాక్..?