ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను రష్యా ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. స్పుత్‌నిక్-వి గా దానికి నామకరణం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాక్సిన్ తొలి డోసును తన కుమార్తెల్లో ఒకరికి ఇప్పించారు. అయితే ఆ వ్యాక్సిన్‌కు గాను తాజాగా ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించారు. అక్కడి పరిశ్రమల ద్వారా ఏడాదికి 500 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేయనున్నారు.
రష్యా కోవిడ్ వ్యాక్సిన్‌ను ఆ దేశ రక్షణ శాఖతోపాటు గమాలియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లు కలిసి అభివృద్ధి చేశాయి. ఫేజ్ 1, 2 ట్రయల్స్‌లో సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పి ఫేజ్ 3 దశలో ఉండగానే వ్యాక్సిన్‌ను పంపిణీ కోసం సిద్దం చేస్తున్నారు. అయితే ఫేజ్ 1, 2 ట్రయల్స్ తాలూకు వివరాలను మాత్రం రష్యా బయటి ప్రపంచానికి విడుదల చేయలేదు. దీంతో ఆ దేశ వ్యాక్సిన్‌పై అనేక మంది సైంటిస్టులు, వైద్య నిపుణులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రష్యా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 20 దేశాలు ఆ దేశంతో డీల్ కుదుర్చుకున్నాయి. తమ వ్యాక్సిన్ సురక్షితమైందని, దానికి ఆందోళన చెందాల్సిన పనిలేదని అక్కడి సైంటిస్టులు చెబుతున్నారు. కాగా మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.