భక్తులు కొంగు బంగారు కోర మీసాల కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, శివసత్తులు పెద్దపట్నం తొక్కేందుకు పోటీపడ్డారు. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం పెద్దపట్నంతో ముగిసింది. సిద్దిపేట జిల్లాలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
మహాశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున స్వామివారి పెద్దపట్నం కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు గర్భాలయంలో లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా తోటబావి వద్ద పెద్దపట్నం నిర్వహించారు. దాదాపు మూడు గంటకు పైగా ఒగ్గు కళాకారులు పంచ వర్ణాలతో పెద్ద పట్నాన్ని వేశారు. రాత్రి అంతా జాగారాలు చేసిన భక్తులు పెద్ద పట్నాన్ని తొక్కేందుకు ఉత్సాహం కనబరిచారు. ముందుగా ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకుని పట్నం దాటారు. అనంతరం భక్తులకు అనుమతించడంతో ఒక్కసారిగా పట్నంలోకి దూసుకురావడంతో తోపులాట జరిగింది.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. మూడు నెలల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభం అయిన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి.