ఇబ్రహీంపట్నం ఘటనపై రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక : డీహెచ్ శ్రీనివాస్

-

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స  ఘటనలో రెండ్రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిగితే దురదృష్టవశాత్తు నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటనపై ఆయన మాట్లాడారు.

మిగతా 30 మందికి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరిని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారని.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు కలిపి మొత్తంగా 11 మందిని ఇవాళ డిశ్చార్జ్‌ చేయనున్నట్లు తెలిపారు. మరో 18 మందిని రానున్న రెండు రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు.

ఈ ఘటనపై విచారణాధికారిగా వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీహెచ్‌ తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పనిచేసిన సిబ్బందిని విచారించినట్లు పేర్కొన్నారు. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని స్పష్టం చేశారు. ఐదారేళ్లలో 12 లక్షలకు పైగా ఆపరేషన్లు జరిగాయని తెలిపారు. వేసెక్టమీపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని.. అయినప్పటికీ ఎవరూ ముందుకు రావట్లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news