తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వెబ్ పేజీ ఏడాది పూర్తి చేసుకుంది. భూ లావాదేవీల్లో పారదర్శకత, మరింత త్వరగా సేవలను అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా ధరణి పోర్టల్ ను తీసుకువచ్చింది. రెవెన్యూ సేవల్లో అత్యాధునికమైన, ట్యాంపర్ ప్రూప్ సేలను అందించేలా ధరణిని రూపొందించారు. గతేడాది సీఎం కేసీఆర్ చేతులు మీదుగా అక్టోబర్ 29న మెడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలోని మూడు చింతల పల్లి గ్రామంలో అట్టహాసంగా ధరణిని ప్రారంభించారు. ధరణి విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్ అధికారులను అభినందించారు. ప్రారంభించనప్పటి నుంచి ఇప్పటి వరకు వెబ్ పేజీ 5.17 కోట్ల హిట్లను సాధించి రికార్డ్ నమోదు చేసింది. ధరణి ఏర్పాటు అనంతరం భూసంబంధిత లావాదేవీలు ప్రజల వద్దకే చేరినట్లయింది. ధరణికి ముందు 141 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో మాత్రమే భూసంబంధిత లావాదేవీలు జరిగేవి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మండలంలో 574 తాసిల్ధార్ కార్యాయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అక్కడిక్కడే పట్టాదారు పాస్ పుస్తకం నమూనా, పహానీ, వన్ బీలను అధికారులు ప్రజలకు అందిస్తున్నారు. ధరణి ద్వారా ఏడాది కాలంలో 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. ధరణి ప్రస్తుతం 31 సేవలతో పాటు, 10 సమాచార మాడ్యుల్లను కలిగి ఉంది.