సుదీర్ఘ కాలం వేచి ఉన్నందున ఆశించిన ఉదయం రానే వచ్చింది. కనుక ఉదయం బాగుంది..నా హృదయం బాగుంది అని పాడుకోవాలి ధర్మాన ప్రసాదరావు. ఎందుకంటే శ్రీకాకుళం కేంద్రంగా రాజకీయాల నడిపే ఉద్దండులు ఈయన. ఎవ్వరిని అయినా క్షణాల్లో అంచనా వేయగల సమర్థులు ఈయన. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులు.ఆయనతో ఉన్న బంధం కారణంగానే ఎన్నో సందర్భాల్లో తన మాట నెగ్గించుకున్నారు. స్వభావ రీత్యా సౌమ్యులే కానీ కోపం వస్తే మాత్రం అస్సలు ఆగదు. సహించరు కూడా! ఇప్పటికీ ఆయనకు ఉమ్మడి ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు. వెలమ సామాజికవర్గానికి చెందిన ఈ పెద్దాయన ఏ మాట అయిన పద్ధతిని అనుసరించే మాట్లాడతారు. పెద్దగా పొగడ్తలకు పొంగిపోరు. విమర్శలు మనం స్వీకరించాలి. అంతేకాని రాసిన వారిపై తగువులకు పోకూడదు అని అనుచరులకు పదే పదే చెబుతారు. ఆయన రాశారు కదా రాయనివ్వండి.ఆయన చదువుకున్న వారు ఆయన మాటలో ఉన్న అర్థం తీసుకోండి.. అంతేకాని వివాదాలను కొనసాగించి నాకు కొత్త తలనొప్పులు తీసుకురాకండి అని పదే పదే చెబుతారు. అదేవిధంగా పెద్దగా ఆడంబరాలకు చోటివ్వరు. సింపుల్ గానే ఉంటారు.
ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై మంచి అవగాహన వ్యక్తి. రెవెన్యూ శాఖను నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి కనుక సంబంధిత చట్టాలు, నియమాలు అన్నీ బాగా తెలిసిన వ్యక్తి. చట్టాలను అనుసరించేందుకు ఏం చేయాలో చెప్పగల సమర్థులు. సీనియర్ లెజిస్లేచర్ కావడంతో శాసన సభ వ్యవహారాలను సైతం ప్రభావితం చేయగల వ్యక్తి. ముఖ్యంగా ప్రతిభను ప్రోత్సహిస్తారు. వద్దండి అతి పొగడ్తలతో ఏమీ రాయొద్దు అని అంటారాయన. సర్ .. మీ ఇంటర్వ్యూ కావాలి అని ఎవ్వరు వెళ్లి అడిగినా ఇప్పుడు నేను పదవిలో లేను నేను మాట్లాడినా వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే వారు తక్కువ. కనుక మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయకండి అని సున్నితంగా చెప్పి పంపుతారు. మాట అంత వేగంగా జారనివ్వరు. విపక్ష పార్టీల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువ నాయకులు ఎవ్వరు బాగా రాణించినా సంతోషిస్తారు. తన వరకూ పెద్దగా వివాదాల జోలికి పోరు కానీ చుట్టూ ఉన్నవారితోనే తరుచూ ప్రమాదాల్లో ఇరుక్కుంటారు. గతంలోనూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరిగిందిదే! ఇకపై అటువంటివి జరగకూడదు అని ఆశిద్దాం. స్నేహానికి విలువ ఇచ్చే నా స్నేహితులు ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవిని చేపడుతున్న శుభ సందర్భాన శుభాకాంక్షలు.
శ్రీకాకుళం దారుల నుంచి