టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిలీవ్ చేసి ధర్మారెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డిని నియమించారు. ఈ సందర్బంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డిని శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటంతో సన్మానించారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇటీవల తీవ్రమైన ఇబ్బందులు పడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డిని ఈవోగా రిలీవ్ చేస్తూ ఆయన స్థానంలో ధర్మారెడ్డికే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో ఈవో నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టే అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.