టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్… టెన్షన్, టెన్షన్ !

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ను ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఉన్న ఆయన నివాసానికి తెల్లవారుజామున భారీ ఎత్తున పోలీసులు, ఏసీబీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 100 మంది పోలీసులు ధూళిపాళ్ల నివాసానికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు.

అనంతరం ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారని తెలుస్తోంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఆందోళన చేస్తున్నారు. నరేంద్ర సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. సంగం డైరీలో అక్రమాలు జరిగాయని ఆయన పై ఏసీబీ కేసు పెట్టింది. సెక్షన్ 408, 409, 418, 420, 45, 471, 120బీ కింద కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ధూళిపాళ్ల సతీమణికి కూడా సీఆర్‌పీసీ సెక్షన్ 50 (2) కింద నోటీసులు జారీచేశారు.