జగన్ అన్న కరెంట్ తీగ లాంటోడు ముట్టుకోకు అని అన్నారు వైసీపీ నాయకులు టీడీపీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు ను ఉద్దేశించి! కానీ ఇక్కడ జరిగింది వేరు. జరుగుతున్నదీ వేరు. పాలక పక్షాలు చేస్తున్నది చేయాలని అనుకుంటున్నదీ వేరు. అయినా కూడా ఆంధ్రావనిలో కరెంట్ కోతలు గురించి అస్సలు మాట్లాడకూడదు అని ఓ మాట శాసనం మాదిరి ఉంది. ఉంది అనే కన్నా పనిచేస్తుంది అని రాయడం మంచిది.
అదే మేలు కూడా ! ఎందుకంటే జగన్ ను ముట్టుకుంటే మాడిపోతావ్ మసైపోతావ్ అని కొడాలి నాని అండ్ కో బూతు పురాణం ఒకటి వినిపిస్తున్నారు కదా! అందుకే ముందుగానే జాగ్రత్త పడితే ఏమౌతుంది. హాయిగా ఎవరు పని వారు చేసుకుంటే ఏమౌతుంది. అయినా ప్రభుత్వాలను విమర్శిస్తే ఏమౌతుంది. ఏమొస్తుంది. అందుకే హాయిగా ఎవరు పని వారు చేసుకోవాలని పదే పదే ముందు జాగ్రత్తగా చెబుతున్ను మాట ఇది.వాస్తవానికి బొగ్గు నిల్వలు నిండుకున్నాయి కనుక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవు. ఒప్పుకోవాలి. ఇంకా ఏమయినా ఉందా చెప్పండి. వీటితో పాటు పెనవేసుకుని పోయిన విషయాలు చాలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు అన్నీ బుట్టదాఖలు చేసి రివర్స్ టెండరింగ్ పేరిట కొంత డ్రామా అయితే నడిపారు. అయితే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రివైజ్ చేయవద్దని కేంద్రం కూడా చెప్పింది. ఒప్పందాల్లో తప్పులుంటే దిద్దుకుని ముందుకు పోవాలే తప్ప, వాటిని రద్దు చేయడం కూడా సబబు కాదని చెప్పింది. కానీ వీటి విషయమై జగన్ సర్కారు మొండి పట్టుదలకు పోయిన కారణంగానే ఇన్ని తలనొప్పులు వచ్చాయన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు జెన్కోకు చెల్లించాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించాల్సి ఉంది. వాటిపై కూడా స్పష్టత లేదు. దీంతో కరెంట్ కోతలు అన్నవి ముందున్న కాలంలోనూ తథ్యం అనే అనిపిస్తున్నాయి.