వచ్చే ఎన్నికల్లో గెలిచినా ఓడినా జనసేన పార్టీ మాత్రం ఉంటుంది అని అంటున్నారు పవన్ కల్యాణ్. అదేవిధంగా పాలక పక్షాలపై పోరు కూడా ఉంటుందని అంటున్నారు పవన్. పవన్ తో పాటు ఇంకొందరు కూడా ఈ సారి జగన్ పై యుద్ధం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే మాత్రం పవన్ బలం ఆ పార్టీకి అదనపు ఆకర్షణ అవుతుంది. అదనపు విలువ కూడా అవుతుంది. ఆ విధంగా 2014 నాటి ఫలితాలు పునరావృతం అవుతాయి.అందుకే జగన్ ఇప్పటి నుంచే అప్రమత్తం అవుతున్నారు.
త్వరలో టీడీపీ నేతలనే టార్గెట్ చేసుకుని జగన్ మరింతగా రాజకీయం నడపనున్నారు.అదేవిధంగా మీడియాను కూడా టార్గెట్ చేస్తే చేస్తారు.బీజేపీ ఎలానూ తనతో రాదు కనుక జగన్ మరింత శ్రద్ధతో రాజకీయం నడపాలి.కొన్ని కారణాల రీత్యా పవన్ ను ఢీకొనడం మాత్రం వైసీపీకి సులువు అయిన పని కాదు. ఎందుకంటే ఆయనకు ఓటు బ్యాంకు చెప్పుకోదగ్గ రీతిలోనే ఉంది. గత ఎన్నికల్లో కూడా మంచి స్థాయిలోనే ఓటింగ్ శాతం ఆయన పార్టీకి నమోదు అయి ఉంది. పవన్ ను ఎన్ని విధాల అడ్డుకోవాలని చూసినా కూడా జగన్ సాధించేది పెద్దగా ఏమీ ఉండదు అని తేలిపోయింది.
సోషల్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ ఇవాళ మరింత యాక్టివ్ అయి ఉన్నారు. పవన్ కు వేరేగా డిజిటల్ వింగ్ ఉన్నా కూడా కొందరు యాక్టివిస్టులు తమ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. జగన్ సర్కారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు అడ్డుకుంటూనే ఉన్నారు.ఈ దశలో పవన్ అంటే జగన్ కు భయం భయంగానే ఉంది. ఎందుకంటే పవన్ కు సోషల్ మీడియాలో విపరీతం అయిన క్రేజ్ ఉంది.
అదేవిధంగా ఆయన చేపట్టే కార్యక్రమాలంటే చాలా మంది మహిళలకు యువతకు విపరీతం అయిన మక్కువ ఉంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ అందుకే పెద్దగా సఫలీకృతం కావడం లేదు అన్నది ఓ వాస్తవం.అందుకే పవన్ ఓ సాధారణ నాయకుడే అని ఆయనకు మనం భయ పడాల్సిన పనే లేదని ఘంటాపథంగా జగన్ చెప్పలేరు. చెప్పబోరు కూడా !