లైఫ్ పార్ట్నర్ తో గొడవలు వచ్చినప్పుడు ఈ పాయింట్స్ మిస్ కాకండి..!

-

ఏ రిలేషన్ షిప్ లో అయినా అప్పుడప్పుడు గొడవలు రావడం సహజం.. ఇక భార్యాభర్తలు, లవర్స్ మధ్యలో అయితే చీటికిమాటికి గొడవలు వస్తాయి. అవి ఆరోజుతో సర్దుమణిగితే పర్వాలేదు.. కానీ కొన్నిసార్లు.. చిలికిచిలికి గాలివానాల తయారవుతుంది. భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుంటాయి. క్రమంగా అవి ఘర్షణకు దారి తీస్తాయి. ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అవి పాటిస్తే..బంధం మరింత ధృడమవుతుందట.
చాటింపువేయొద్దు..
మీ ఇద్దరి మధ్య వచ్చే గొడవలను మనసులో దాచుకోక.. ఎవరికైనా చెప్తే భారం దిగుతుందని ఇక స్నేహితులు, తల్లిదండ్రులు అందరికి వరస పెట్టి చెప్పేయకండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి అందరికీ తెలియడం తప్ప ఏ లాభం ఉండదు. వాళ్లకు మాట్లాడుకోవాడానికి మీరే కంటెంట్ ఇచ్చినట్లు అవుతుంది. చెప్పాక ఊరికే ఉండరు కదా.. ఏదో ఒకటి అనాలి.. ఎదురుగా ఉన్న మిమ్మల్ని అంటే మీరు ఊరుకోరు.. ఇక మీ భాగస్వామిదే తప్పనట్లు వారు చెప్తారు. దాంతో మీకు ఇంకా మండుతుంది. తద్వారా మీరు మీ భాగస్వామితో మళ్లీ గొడవకు దిగడం, ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరగడం.. కూడా జరగొచ్చు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఇతరులకు చెప్పడం కంటే.. దంపతులిద్దరూ పరిష్కరించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే సమస్య తీరుతుంది. తీర్చుకోలేని గొడవలు, సమస్యలేవైనా ఉంటే మాత్రమే ఇరువురి పేరెంట్స్‌కి తెలియజేయాలి. అప్పుడే వారే రాజీకుదిర్చి కాపురాన్ని నిలబెడతారు.
కోపం వద్దు
నచ్చని పని చేసినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. అయితే దీన్ని తగ్గించుకొని ఎదుటివారిని క్షమించగలిగినప్పుడే ఆ బంధం మరింత ధృడమవుతుంది. కానీ కొందరు కోపాన్ని అణచుకోలేరు. దాంతో భాగస్వామిని మన్నించలేరు. వారు ఏ విషయం మాట్లాడినా మీకు నచ్చక, లేనిపోని గొడవలకు దారితీస్తుంది. కాబట్టి కోపాన్ని ఎంత త్వరగా అణచుకుంటే అంత మంచిది. ఇందుకోసం కాసేపు ఒంటరిగా కూర్చొని, అసలు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణాలేంటి? అది కూడా అవసరమైన విషయాలకే గొడవపడుతున్నామా.. సిల్లీ రీజన్స్ ఉన్నాయా అని విశ్లేషించుకోండి. అప్పుడే ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదానికి పరిష్కారం దొరుకుతుంది.
క్షమించాలి
ఎదుటివారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకొచ్చి క్షమాపణ కోరుతుంటే బెట్టు చేయకుండా దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే భార్యాభర్తల బంధం నిలబడుతుంది. ఇలా చేయడం వల్ల మరోసారి ఇలాంటి గొడవలు రాకుండా ఉండడంతో పాటు ఇద్దరిలోనూ ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం కూడా పెరుగుతుంది.
ఇలా అనొద్దు
గొడవలు వచ్చినప్పుడు.. పొరపాటున కూడా..’జీవితాంతం నీతో బతకడం నా వల్ల కాదు.. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది..’ అంటూ విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు అస్సలు మాట్లాడుకోవద్దు. కానీ ఇంత చిన్న గొడవకు అంత పెద్ద శిక్ష కరక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలకు స్వస్తి పలికి ఇద్దరి మధ్య వచ్చిన గొడవకు సరైన పరిష్కారం ఏంటి… అనేది ఇద్దరూ కలిసి కూర్చొని ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుకుపోతూ ముందుకు సాగాలి. అప్పుడే వైవాహిక బంధం మరింత దృఢమవుతుంది.
ఏం జరగలేదా?
కొందరూ ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. అలాంటి వారికి అన్నీ తప్పులగానే కనిపిస్తాయి. ఇంకొందు ఎంత గొడవలు జరిగినా..ఏం జరగనట్లు లైట్ తీసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ రెండు ప్రవర్తనలు మంచివి కావు. మనసులో ఒకటి పెట్టుకుని.. పైకి ఏం జరగలేదన్నట్లు నటించడం మంచిది కాదు కదా.. ఏదైనా ఉంటే మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. అలా రెండు ఒపీనియన్స్ తో మీరు మీ భాగస్వామితో ప్యూర్ గా ఉండగలరా.. పోనీ మీరు ప్రశాంతంగా అయినా ఉండగలుగుతారా? లేదు కదా.. కాబట్టి భాగస్వామితో జరిగే గొడవల్ని మనస్ఫూర్తిగా మర్చిపోయి.. వారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఎలాంటి మనస్పర్థలొచ్చినా ఇరువురి అనురాగాన్ని ఏమీ చేయలేవు.
గొడవలు లేని సంసారం అంటూ ఉండదూ.. కానీ వాటిని పరిష్కరించుకునే ఓర్పు, నైపుణ్యమే ఈతరం వారికి కాస్త తక్కువ ఉంటుంది. అసలు పెళ్లే వద్దనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక అలాంటివారికి పెళ్లయ్యాక ఈ లొట్టపీసు పంచాయితీలు డైలీ ఉన్నాయంటే.. మారు మాట లేకుండా విడాకులకు రెడీ అయిపోతారు. ముందు దేన్నైనా.. ఎదుటివారి కోణంలో ఆలోచించడానికి ట్రై చేయండి. అప్పుడు వారి చేసింది కరెక్టా కాదా అని మీకు తెలుస్తుంది. ఎంత సేపు మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే..పక్కోడు చేసేది మనకు ఎప్పటికీ తప్పులానే ఉంటుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news