సీఎం పదవిపై డీకే శివకుమార్, సిద్దరామయ్య పట్టువీడటం లేదు.. దీంతో కర్ణాటక సీఎం ఎవరన్నది ఉత్కంఠ నెలకొంది. ఘన విజయం సాధించినప్పటికీ.. ఇద్దరు కీలక నేతలు సీఎం పదవి కోసం పట్టుబట్టడంతో.. కర్నాటక రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. సీఎం ఎవరన్న విషయంపై అతిత్వరలో క్లారిటీ రానుంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ తన అనుచరులతో సమావేశమయ్యారు. అనంతరం శివకుమార్ తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానంటూ పేర్కొన్నారు. సోనియా, రాహుల్, ఖర్గే సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.
తన నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 135 అసెంబ్లీ స్థానాలు దక్కాయని డీకే చెప్పారు. తాను ఒంటరిగానే పోరాటం చేస్తానని, గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ధైర్యం కోల్పోకుండా తిరిగి పార్టీని బలోపేతం చేశానని చెప్పారు. అదేవిధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇటీవల తన బర్త్ డే వేడుకల్లో కూడా సిద్దరామయ్య పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రంలో తనకంటూ ఉన్న మద్దతుదారుల సంఖ్యను తాను చెప్పనని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తాను తన గురువును కలిసిన తర్వాతనే ఢిల్లీకి వెళ్తానన్నారు. అయితే తన గురువు ఎవరో ఆయన వెల్లడించలేదు.