యూజీసీ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీలోని ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్’ (ఏఐఐపీహెచ్ఎస్) అనే యూనివర్సిటీ.. ఫేక్ యూనివర్సిటీ అని యూజీసీ వెల్లడించింది. ఈ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరూ జాయిన్ అవ్వొద్దని నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే మే 27, 2022న ప్రస్తుతం ఆ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.
యూజీసీ నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ యూజీసీ యాక్ట్-1956ని ఉల్లంఘిస్తోందన్నారు. అనుమతులు లేని వివిధ డిగ్రీ కోర్సులను అందిస్తోందన్నారు. సెక్షన్ 22(1) ప్రకారం ఏఐఐపీహెచ్ఎస్‌ను నకిలీ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తున్నామని, విద్యార్థులకు ఎలాంటి డిగ్రీని అందజేసే అధికారం లేదన్నారు. ఈ మేరకు యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ ఆ ఫేక్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా జారీ చేసిన నోటీసులపై సంతంకం చేశారు. అలాగే అటానమస్ సంస్థల్లో అడ్మిషన్ తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.