యాపిల్స్‌, మిరియాలు, జున్నపై వైరస్‌ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా..?

-

కరోనా వైరస్‌ మళ్లీ పుంజుకుంటుంది..చైనాలో మరణ మృదంగం మోగుతోంది. ఈ టైమ్‌లో మనం అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..మునపటి రోజులను మళ్లీ కొనితెచ్చుకున్నట్లే. మాస్క్‌, శానిటైజర్‌తో పాటు వైరస్‌ ఏ వస్తువులపై ఎంత సేపు ఉంటుందో ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి చెప్పారు. ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ (ఎఫ్ఎస్‌‌ఏ) కోసం శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించారు. పండ్లు, పిండి వంటలు, డ్రింక్స్‌తో సహా ప్యాకేజింగ్, ఆహార ఉత్పత్తులపై వైరస్‌ను ప్రవేశపెట్టి పరిశోధన చేశారు.
ముఖ్యంగా వండకుండా లేదా కడగకుండా ప్రజలు తినే వస్తువులను శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. వీటితో వినియోగదారులకు ప్రమాదం తక్కువేనని వారు చెప్పారు. ఈ అధ్యయనానికి వినియోగించిన ఆహారాలు, ప్యాకేజింగ్‌లకు సార్స్-కోవ్-2 టీకాలు వేశారు శాస్త్రవేత్తలు. పరీక్షల కోసం ఎంపిక చేసిన పలు ఆహార ఉత్పత్తులపై మొదటి 24 గంటల్లో వైరస్ కొద్దిగా తగ్గింది. అయితే కొన్ని సందర్భాల్లో వాటి జాడలు ఒక వారం పాటు ఉన్నాయని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ బృందం తెలిపింది.
కిరాణా, బేకరీ కౌంటర్ల వద్ద విరివిగా విక్రయించే ఆపిల్స్, మిరియాలు, జున్ను, మాంసం, ఆలివ్ కాయలు, గట్టి బ్రెడ్, క్రోసెంట్స్ లాంటి ఆహారాలను పరిశోధకులు ఎంచుకున్నారు. వీటితో పాటు డ్రింక్ బాటిళ్లు, డబ్బాలు కూడా పరీక్షించారు. వైరస్ సోకినవారు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వెలువడే పరిమాణానికి సమాన స్థాయిలో శాస్త్రవేత్తలు, ఆహారపదార్థాలపై వైరస్‌ను ఉంచారు.తుంపర్లు ద్వారానే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన ఉపరితలాలను తాకడం కంటే ఆ బిందువులను పీల్చితేనే కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపారు. ఎఫ్‌ఎస్ఏ మైక్రోబయోలాజికల్ రిస్క్ అసెస్‌మెంట్ టీమ్ లీడర్ ఆంథోనీ విల్సన్ మాట్లాడుతూ కోవిడ్ ప్రారంభ దశలలో ఆహార ఉపరితలాలు, ప్యాకేజింగ్‌లపై వైరస్ ఎలా మనుగడ సాగిస్తుందనే విషయం మాకు పెద్దగా తెలియదు. కాబట్టి ప్రమాద అంచనాలన్నీ చెత్తగా అనిపించేవి అని అన్నారు.
ఈ పరిశోధన వివిధ రకాల ఆహార పదార్థాల ఉపరితలాలపై వైరస్ గురించి అదనపు సమాచారాన్ని అందిస్తుంది. కరోనా ప్రారంభ దశలలో మేం చేసిన అంచనాలు సముచితమైనవని, ఆహారం ద్వారా కోవిడ్‌ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిర్ధారిస్తుందని అన్నారు. అంతేకాకుండా శాస్త్రవేత్తల బృందం ఆహార పదార్థాలు నిల్వ చేసే సమయంలో ఉష్ణోగ్రత, తేమ స్థాయిని పరిశీలించింది.

ఏ పదార్థాలపై ఎన్ని రోజులు..

నునుపుగా ఉన్న ఆపిల్ లాంటి వాటి కంటే బ్రకోలీ, బెర్రీస్ (రాస్ప్ బెర్రీస్) లాంటి అసమాన ఉపరితలాలు కలిగిన పదార్థాలపై వైరస్ ఎక్కువ కాలం ఉంటోంది. చల్లటి తాజా మిరియాలపై ఒక వారం తర్వాత కూడా వైరస్ కనిపించింది.
యాపిల్స్‌లో సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి కొన్ని నిమిషాల్లో లేదా గంటల్లో కోవిడ్ వైరస్‌ను విచ్ఛిన్నం చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

డెలీ ఐటెమ్స్

జున్ను, చల్లని మాంసం, అధిక ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలలో వైరస్ రోజుల తరబడి (వారం) ఉంటోంది.

కాల్చిన వస్తువులు

పెయిన్ ఓ చాకొలట్ లాంటి పిండి వంటలపై కొన్ని గంటల తర్వాత కొద్దిమేర వైరస్ జాడలు కనిపించాయి. బేకింగ్ సమయంలో వాటికి గుడ్డు పూయడం కారణం కావొచ్చు. గుడ్లలో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీవైరల్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కోవిడ్ ప్లాస్టిక్ ఉపరితలాలపై ఒక వారం వరకు జీవించగలదు. డబ్బాల మీద ఇది చాలా రోజులు ఉండొచ్చు. అల్యూమినియం క్యాన్లపై కొన్ని గంటల వరకు ఉంటుందని పరిశోధకులు తెలిపారు. కాబట్టి…ఈ వస్తువులు వాడేముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news