ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ ప్రారంభం అయ్యేందుకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల అసలు ఐపీఎల్ జరుగుతుందా ? అని నిన్న మొన్నటి వరకు సందేహించారు. కానీ కొన్ని సమస్యలు మినహా ఎలాంటి మేజర్ ఇబ్బందులు లేకపోవడంతో టోర్నీ అనుకున్న ప్రకారం ప్రారంభమవుతోంది. అయితే ఈసారి ఐపీఎల్ టోర్నీలో తలపడనున్న ఆయా జట్లకు చెందిన కెప్టెన్ల వేతనాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.
1. విరాట్ కోహ్లి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆ జట్టు యాజమాన్యం రూ.17 కోట్ల వేతనం చెల్లిస్తోంది. ఆ జట్టులోని అత్యధిక మొత్తం తీసుకునే ఆటగాడి కన్నా కోహ్లికి రూ.2 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. కోహ్లి ఆర్‌సీబీ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది 8వ సారి.
2. రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ జట్టు యాజమాన్యం రూ.15 కోట్ల వేతనాన్ని చెల్లిస్తోంది. రోహిత్ శర్మకు కూడా నిజానికి కోహ్లి లాగే వేతనం రావల్సి ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు. ఇక రోహిత్ ముంబై తరఫున 2011 నుంచి ఆడుతున్నాడు.
3. ఎంఎస్ ధోనీ
ఎంఎస్ ధోనీకి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.15 కోట్ల వేతనం చెల్లిస్తోంది. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే 3 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. అలాగే ఆ జట్టు 8 సార్లు ఐపీఎల్ ఫైనల్స్‌కు వెళ్లింది.
4. శ్రేయాస్ అయ్యర్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ శ్రేయాస్ అయ్యర్‌కు రూ.7 కోట్ల వేతనం చెల్లిస్తోంది. 2018లో ఢిల్లీ టీం ఇతన్ని రీటెయిన్ చేసుకుంది. అయితే ఢిల్లీకి రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ దక్కుతుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా శ్రేయాస్‌ను ఆ అదృష్టం వరించింది.
5. స్టీవ్ స్మిత్
రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు రూ.12 కోట్ల వేతనం చెల్లిస్తోంది. స్మిత్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నందున 2018 ఐపీఎల్‌ను మిస్ అయ్యాడు. 2019 నుంచి రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.
6. డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ.12 కోట్ల వేతనం ఇస్తోంది. 2019 ఐపీఎల్‌లో వార్నర్ 12 మ్యాచ్‌లలో ఏకంగా 692 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు.
7. కేఎల్ రాహుల్
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కేఎల్ రాహుల్‌కు రూ.11 కోట్ల వేతనం ఇస్తోంది. పంజాబ్ తరఫున రాహుల్ 146.60 స్ట్రైక్ రేట్‌తో 1252 పరుగులు చేశాడు. 2018 వేలంలో పంజాబ్ టీం ఇతన్ని కొనుగోలు చేసింది.
8. దినేష్ కార్తీక్
దినేష్ కార్తీక్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రూ.7.4 కోట్ల వేతనం ఇస్తోంది. 2018లో రాబిన్ ఊతప్పకు కెప్టెన్సీ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ చాన్స్ కార్తీక్‌కు దక్కింది.