చిన్నవయసులో గుండెపోటు ముప్పు.. కారణమేంటో తెలుసా..?

-

గుండెపోటు.. అదేనండి హార్ట్ ఎటాక్.. ఈ మధ్య చిన్న పిల్లల నుంచి యువకులు, పండు ముసలి వాళ్ల వరకు అందరిలోనూ వస్తోంది. అప్పటిదాకా ఎంతో ఫిట్​గా ఉన్నవాళ్లు కూడా అకస్మాత్తుగా హార్ట్​ఎటాక్​తో చనిపోతున్నారు. సాధారణంగా వయసు మీద పడటం, శారీరక శ్రమ అంతగా చేయకపోవడం, రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగటం, ఊబకాయం, పొగ తాగే అలవాటు.. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బులు ఉండటం దీని ముప్పు పెరిగేలా చేస్తాయి. మరి ఇలాంటి కారకాలేవీ లేకపోయినా.. శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారు సైతం చిన్నవయసులోనే హఠాత్తుగా గుండెజబ్బుతో ఎందుకు మరణిస్తున్నారు? ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనికి కారణమేంటంటే..?

 

మన గుండె కొట్టుకోవటానికి ప్రత్యేక విద్యుత్‌ వ్యవస్థ తోడ్పడుతుంది. గుండె వేగం, లయను నియంత్రించేది ఇదే. ఈ విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండెలయ దెబ్బతింటుంది (అరిత్మియా). దీంతో గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు. లేదూ నెమ్మదిగా కొట్టుకోవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోనూ వచ్చు. గుండెలయ సమస్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గుండె కింది గదులకు సంబంధించిన వెంట్రిక్యులర్‌ టెకీకార్డియా, వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌ గురించే. హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి 99% వరకు కారణం ఇవే. వెంట్రిక్యులార్‌ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకోవటమనేదే ఉండదు. విద్యుత్‌ వ్యవస్థలో షార్ట్‌ సర్క్యూట్‌ తలెత్తినట్టుగా గుండె ఆగిపోతుంది. అదే టెకీ కార్డియాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఇది హఠాత్‌ మరణానికి దారితీయదు. కానీ క్రమంగా వెంట్రిక్యులర్‌ ఫిబ్రిలేషన్‌కు దారితీస్తుంది. ఇది ఉన్నట్టుండి గుండె ఆగిపోయి, చనిపోవటానికి కారణమవుతుంది.

heart-burn

 

గుండెపోటు, విద్యుత్‌ వ్యవస్థ సమస్యలు వేర్వేరు అయినా కొందరికి గుండె రక్తనాళాల్లో పూడికల మూలంగానూ హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. గుండెపోటుతో చనిపోతున్నవారిలో 50% వరకు మరణాలకు కారణమిదే. ఇలాంటివారు సాధారణంగా ఛాతీ నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు మొదలైన గంటలోపు కుప్పకూలటం చూస్తుంటాం.

 

కొందరికి తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ, ఆటలతోనూ గుండె విద్యుత్‌ వ్యవస్థ విఫలం కావచ్చు. అయితే వీరిలో చాలామందికి అప్పటికే వంశపారంపర్యంగా గుండె కండరం మందం కావటం (హైపర్‌ట్రోపిక్‌ కార్డియోమయోపతీ) వంటి గుండె సమస్యలుంటాయి. ఇలాంటివారు తీవ్రమైన శ్రమ చేసినప్పుడు అడ్రినలిన్‌ హార్మోన్‌ విడుదలై, విద్యుత్‌ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది.

కొందరికి ఇతర భాగాల్లో ఏర్పడే రక్తం గడ్డలు గుండె రక్తనాళాలకు చేరుకోవటంతోనూ (పల్మనరీ ఎంబాలిజమ్‌) హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. ఉదాహరణకు- గంటలకొద్దీ కదలకుండా కూర్చొని ప్రయాణాలు చేసేవారిలో కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. ఇవి ఊపిరితిత్తులకు, అక్కడ్నుంచి గుండె రక్తనాళాలకు చేరుకొని హఠాత్తుగా గుండె ఆగిపోయేలా చేయొచ్చు. పొగ తాగటం, గుట్కా నమలటం.. కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాల వాడకంతోనూ హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదముంది.

గుండె ఆగిపోవటం అప్పటికప్పుడు తలెత్తే సమస్య. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇటీవల చిన్నవయసులోనే ఎంతోమంది దీని బారినపడటం కలవరం కలిగిస్తోంది. దురదృష్టవశాత్తు దీన్ని నివారించుకోవటానికి ప్రత్యేకమైన విధానాలేవీ లేవు. గుండె ఆరోగ్యానికి తోడ్పడే పద్ధతులే దీనికీ ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్‌, గ్లూకోజు మోతాదులు, రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కువైతే తగు చికిత్సలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ ఎక్కువైనవారికి స్టాటిన్స్‌ బాగా ఉపయోగపడతాయి.

హఠాత్తుగా గుండె ఆగటం అత్యవసర సమస్య. కాబట్టి సత్వరం స్పందించాల్సి ఉంటుంది. శ్వాస ఆగటం, స్పృహ తప్పటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డిఫ్రిబిలేటర్‌తో తిరిగి గుండె కొట్టుకునేలా చేయాల్సి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఛాతీకి తాకించి, తీస్తే గుండెకు విద్యుత్‌ షాక్‌ తగులుతుంది. ఫలితంగా ఆగిన గుండె తిరిగి కొట్టుకోవటం మొదలవుతుంది. కొన్నిసార్లు కార్డియో పల్మనరీ రిససికేషన్‌ (సీపీఆర్‌) పద్ధతి ఉపయోగపడుతుంది. ఇందులో ఛాతీ మధ్యలో అరచేతితో పదే పదే గట్టిగా నొక్కుతూ, పైకి తీయాల్సి ఉంటుంది. ఇది గుండె తిరిగి కొట్టుకోవటానికి తోడ్పడుతుంది. ఛాతీనొప్పి, స్పృహ తప్పటం వంటివి మొదలైన వెంటనే దీన్ని చేయగలిగితే కొంతరకు ఫలితం కనిపించొచ్చు. ఆలస్యంగా చేస్తే పెద్దగా ఉపయోగమేమీ ఉండదు.

లక్షణాలు

  • హఠాత్తుగా గుండె ఆగటంలో ముందస్తు లక్షణాలేవీ ఉండవు. లక్షణాలు అప్పటికప్పుడే మొదలవుతాయి.
  • ఉన్నట్టుండి కుప్పకూలటం
  • నాడి కొట్టుకోకపోవటం
  • శ్వాస తీసుకోకపోవటం
  • స్పృహ తప్పటం
  • అయితే కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోవటానికి ముందు కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపించొచ్చు.
  • ఛాతీలో బిగపట్టినట్టు ఉండటం
  • ఆయాసం
  • బలహీనత
  • శ్వాస వేగంగా తీసుకోవటం
  • గుండె అదరటం

 

Read more RELATED
Recommended to you

Latest news