ఉప్పు లేకుండా ఏ వంట రుచిగా ఉండదు.. దాంతో కచ్చితంగా మనం వంటల్లో ఉప్పు వాడతాం. అసలే ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.. మరీ తప్పక వంటల్లో వాడామే అనుకో అక్కడితో ఆగొచ్చు కదా.. మామిడి ముక్కలపైన ఉప్పు, ఉడకపెట్టిన గుడ్డుపైనా ఉప్పు, మొక్కజొన్నపొత్తుల పైనా ఉప్పు, సలాడ్స్‌లోనూ ఉప్పు.. ఇలా రుచి పేరుతో ఉప్పును విపరీతంగా వాడి జీవితాన్ని ముప్పులో పడేసుకుంటున్నాం.. పచ్చి కూరగాయల మీద ఉప్పు వేయడం అత్యంత ప్రమాదకరమట.. మీకు గానీ ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.! ఇంకొంతమంది ఉంటారు.. ఉప్పులో ఉండే సోడియం వల్లే ఈ పంచాయితీ అనీ..సోడియం తక్కువగా ఉన్న ఉప్పు వాడతారు.. అది ఇంకా డేంజరట..!
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అధిక రక్తపోటు వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల మరణాల ప్రమాదం 24 శాతం వరకు పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.. కానీ చాలా మంది రోజువారీ ఆహారంలో 11 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. చెబుతున్నాయి. ఈ అలవాటు అధిక రక్తపోటుతో పాటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఉప్పులో సోడియం ఉంటుంది. ఈ సోడియం శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఈ కారణంగా, చాలా మంది తక్కువ సోడియం ఉప్పును ఎంచుకుంటారు. అయితే తక్కువ సోడియం ఉప్పు శరీరానికి నిజంగా మంచిదేనా అనేది కూడా షుగర్ లెస్ స్వీట్ లాంటిదే.. రెండూ మంచివి కావు.!
సోడియం తక్కువగా ఉండే ఉప్పు ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగపడదని నిపుణులు అంటున్నారు. ఈ రకమైన ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది కానీ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు.
సోడియం, పొటాషియం అసమతుల్యత శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఈ మినరల్స్ సరైన మోతాదులో ఉండటం ముఖ్యం. ఇక్కడ ఏకైక మార్గం ఆహారంలో తక్కువ మొత్తంలో ఉప్పును ఉపయోగించడమే. ఉప్పు మంచిది కాదని సోడియం తక్కువగా ఉన్న ఉప్పు వాడటం ఇంకా ప్రమాదకరం. వీలైనంత వరకూ ఉప్పు వాడకం తగ్గించేందుకు ప్రయత్నించమంటున్నారు ఆరోగ్య నిపుణులు.