విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ విడుదల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు..దిగ్బ్రాంతికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా విషయమై శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు రాజమౌళి మరియు ఆయన బృందం.దేశ వ్యాప్తంగా రాజమౌళితో పాటు తారక్,చరణ్ పర్యటించి ముఖ్యమయిన ప్రదేశాల్లో సినిమా సంగతులు చెబుతూ తమ ప్రయాణం గురించి వివరిస్తూ తక్కువ ఖర్చుతో సినిమా పబ్లిసిటీ రేంజ్ ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో నిన్నటి వేళ కోల్ కతా దారుల్లో హౌరా బ్రిడ్జి దగ్గర ట్రిపుల్ ఆర్ బృందం సందడి చేసింది. అదేవిధంగా వారణాసి దారుల్లో కూడా ట్రిపుల్ ఆర్ బృందం ప్రయాణించి శివయ్యకు మొక్కులు చెల్లించి వచ్చింది. అంతకుమునుపు అమృత్ సర్ లోనూ పర్యటించిందీ బృందం. ఇలా ఒక్కటేంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రతిచోటుకూ ట్రిపుల్ ఆర్ బృందం వెళ్లేందుకు స్థానిక ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడుతోంది. ఇప్పటికే రాజస్థాన్ దారుల్లోనూ సందడి చేసింది. ఇవన్నీ బాగానే ఉన్నా సినిమాకు సంబంధించి మరో వివాదం ఒకటి నడుస్తోంది.
ముఖ్యమయిన వివాదం ఇది. సున్నితం అయిన వివాదం ఇది. గతంలో ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎన్టీఆర్,ఏఎన్నార్ అభిమానులు తరువాత చిరంజీవి, బాలయ్య అభిమానులు నువ్వా – నేనా అన్న విధంగా కొట్లాటకు దిగిన సందర్భాలు ఉన్నాయి. పరిణామాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడవి లేవు. కానీ చాప కింద నీరులా ఇప్పుడీ తరహా వివాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇందుకు కర్ణాటకలో మొన్నటి వేళ నిర్వహించిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకల్లో ఇరు అభిమానుల మధ్య జెండాల వివాదం నెలకొంది. పవన్ అభిమానులు జనసేన జెండా ఎగువ వేశారు. తారక్ అభిమానుల జెండా మధ్య ఎత్తైన టవర్ పై ఎగుర వేసిన ఈ జెండా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిని వెంటనే తారక్ అభిమానులు తొలగించారు. ఇరు వర్గాలూ కొట్టుకున్నాయి. సభా ప్రాంగణాన చాలా సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అదేవిధంగా తారక్ అభిమానులు స్టేజ్ పైకి వచ్చి అతి చేశారు. వీరిని రాజమౌళి అతి కష్టమ్మీద నిలువరించి సమస్యను పరిష్కరించారు.ఇవన్నీ సద్దుమణిగినా ఫ్లెక్సీల వివాదం మాత్రం అస్సలు పరిష్కారం కావడం లేదు. అటు నందమూరి అభిమానులు, ఇటు కొణిదెల అభిమానులు కొట్టుకుంటున్నారు. రక్తాలు వచ్చే విధంగా కొట్టుకుంటున్నారు. అసభ్యకర భాషలో తిట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ప్రతిరోజూ నమోదు అవుతూనే ఉన్నాయి. కొందరు పోలీసులకు చిక్కుతున్నారు. కొందరు రాజకీయ నాయకుల సాయంతో తెలివిగా తప్పించుకుని స్థానికంగా పట్టు పెంచుకునేందుకు అనవసర ఉద్రిక్తతలు పెంచుతున్నారు. కనుక అభిమానులు తగ్గితే బెటర్.. అప్పుడు మంచి వాతావరణం ఒకటి తప్పక నెలకొంటుంది.