తెలంగాణ ప్రభుత్వం మూసీ పరిధిలోని పేదలకు గుడ్ న్యూస్ చెప్పంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించారు. మూసీ పరిధిలోని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు.
మూసీ పరిధిలో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపులో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సుమారు 10 వేల ఇండ్లను కేటాయించాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. ఈ క్రమంలో మూసీలో ఆక్రమణలు తొలగించాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ధి పనులపై ప్రాథమిక విచారణ పూర్తయింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మాణ పనులు పూర్తయి సిద్ధంగా ఉన్న 69 వేల పైచిలుకు ఇండ్లను ఐదు ఆరు దశలలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులకు సంబంధించి అమలు చేయాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఏం జరుగుతుందోనని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.