హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ జోన్ కు కొత్త బస్సులు సమకూర్చనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్ బస్సులే. వచ్చే ఏడాదివన్నీ అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నవే. ఇందులో 10 డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. వచ్చేనెల 21 వరకు టెండరు దాఖలు చేయాలని సంస్థ సూచించింది.
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు విశ్వనగర కీర్తి దిశగా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని టీఎస్ ఆర్టీసీ భావించింది. గతంలో టెండర్లు సైతం పిలిచింది. అశోక్ లే ల్యాండ్ సంస్థ ద్వారా కొనాలని నిర్ణయించినా, తర్వాత ఆర్థిక వనరులు సమకూరక వెనక్కి తగ్గింది. ఒక్కో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ధర రూ.2 కోట్లకు పైగా ఉండడం, కేంద్రం రాయితీ రూ.30 లక్షలకే పరిమితమవటంతో నేరుగా కొనాలనే ఉద్దేశాన్ని విరమించుకుంది.
10 డబుల్ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది. ఎలక్ట్రికల్ బస్సులు నగరమంతటా నడవనుంగా డబుల్ డెక్కర్‌వి మాత్రం వంతెనల ఆటంకం లేని మార్గాల్లోనే నడుస్తాయి.