గతేడాది కిందట ఓ డాక్టర్ ఎన్ 95మాస్కులు, పీపీఈ కిట్లు లేవని, డాక్టర్లకు ఇవ్వట్లేదని నానా హంగా చేశాడు గుర్తుందా. ఇదే విషయంపై ఆయన గుండు కూడా తీసుకుని, అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై నిరసన తెలుపుతుండగా.. కొందరు అతన్ని చితకబాదారు. పోలీసులు కూడా ఆయన్ను చేతులు కట్టేసి మరీ రోడ్డుపైనే ఈడ్చుకుంటూ కొట్టారు. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది.
ఆయన్ను అప్పుడు ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. ఆయనే విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సుధాకర్. ఆయన శుక్రవారం గుండెపోటులో మరణించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వమే అతన్ని హత్య చేసిందంటూ టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. ఒక దళిత డాక్టర్‌ను కొట్టించి, సస్పెండ్ చేసి చివరికి అతడి మరణానికి కారణమయ్యారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈయన మృతిపై అటు దళిత సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. వైసీపీ కక్ష సాధింపు చర్యలతోనే ఆయన తీవ్ర మనస్థాపానికి గురై గుండెపోటుతో చనిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.