ముంబై హైకోర్ట్ ముందుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్

ఆర్యన్ ఖాన్ కు ఈసారైనా బెయిల్ వస్తుందా..? జైల్ నుంచి విడుదలవుతాడా..? వంటి ప్రశ్నలకు నేడు సమాధానం లభించనుంది. ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు వరసగా కోర్టుల్లో చుక్కెదురవుతోంది. వరసగా పెట్టుకుంటున్న బెయిల్ పిటీషన్లను కోర్ట్ తిరస్కరిస్తోంది. ఈనెల 20న డ్రగ్స్ కేసును విచారిస్తున్న స్పెషల్ కోర్ట్ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను తోసిపుచ్చింది.

 ఈనెల 30 వరకు జుడీషియల్ రిమాండ్ ను విధించింది. దీంతో ఆర్యన్ ఖాన్ తరుపు లాయర్లు ముంబై హైకోర్టును ఆశ్రయించనున్నారు. నేడు ఆర్యన్ ఖాన్ తరుపున స్పెషల్ కోర్ట్ తీర్పును సవాల్  చేస్తూ హైకోర్ట్ ను బెయిల్ ఆప్లై చేయనున్నారు. ఆర్యన్ ఖాన్ తో పాటు అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ బెయిల్ కోసం ముంబై హెకోర్ట్ ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. జైలులో ఉంటున్న ఆర్యన్ ఖాన్ ను షారుఖ్ ఖాన్ ఈనెల 21న కలిశారు.