తాగి డ్రైవింగ్ చేయమంటూ.. వెయ్యిసార్లు ఇంపోజిషన్‌ రాసిన మందుబాబులు

-

మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదకరం అని ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరు మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మందుబాబులను పట్టుకునేందుకు అర్ధరాత్రి అపరాత్రి అంటూ తేడాలేకుండా డ్రంక్ డ్రైవ్​లు నిర్వహిస్తున్నా.. వారు తమ పంథా మార్చుకోవడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు.. ఆ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం.. వారి కుటుబం రోడ్డున పడటం. ఇదీ తంతు. కేరళ సర్కార్ దీనికి అడ్డుకట్ట వేయాలనుకుంది. దానికి హైకోర్టు కూడా సాయం చేసింది. ఫలితంగా మందుబాబులకు బుద్ధిచెప్పే ఓ ఆలోచన చేసింది.

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్‌ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్‌ రాయించారు.  ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మరణించాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్‌ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. ఇంపోజిషన్‌ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news