తెలంగాణలో అత్యంత ఆసక్తిరేపిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ నెల 10వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక ఈ రోజు దుబ్బాక ఉప ఎన్నికపై ఫలితం ఎలా ఉండబోతోందో ? ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి. మిషన్ చాణుక్య సంస్థ అంచనాల ప్రకారం దుబ్బాకలో బీజేపీ విజయం సాధించనుంది. అక్కడ ఓటర్లు ఈ సారి పార్టీలకు అతీతంగా రఘునందన్‌రావు నాయకత్వాన్ని సపోర్ట్ చేశారని ఈ సర్వే స్పష్టం చేసింది. మిషన్ చాణుక్య అంచనాల ప్రకారం ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ 9780 ఓట్ల మెజార్టీతో విజయం సాధించనుంది.
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి 51.82శాతం ఓట్లు, టీఆర్ఎస్‌కు 35.67 శాతం, కాంగ్రెస్‌కు 12.15 శాతం ఓట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని బీజేపీ ఈ సారి ఏకంగా సగానికిపైగా ఓట్లతో రికార్డు క్రియేట్ చేయనుందని సర్వే చెప్పింది. అయితే ఆరా సంస్థ మాత్రం టీఆర్ఎస్ 6 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధిస్తుందని చెప్పింది. ఆరా సంస్థ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని చెప్పింది. ఇక ఇప్పుడు ఈ హోరాహోరీ ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆసక్తి ఏర్పడింది.
ఆరా లెక్కల ప్రకారం టీఆర్ఎస్ 48.72, బీజేపీ 44.64, కాంగ్రెస్ 6.12, ఇతరులు 2.5శాతం ఓట్లు వస్తాయి. అయితే ఆరా చెప్పిన దాంట్లో మొత్తం ఓట్లలో 3 శాతం అటూ ఇటూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పింది. ఇక ఈ రెండు సంస్థలు వేర్వేరుగా చెప్పడంతో ఫలితం టీఆర్ఎస్ , బీజేపీ మధ్య దోబూచులాడుతుందన్న విషయం క్లీయర్‌గా తెలుస్తోంది.
ఇక లక్ష ఓట్లతో గెలుస్తాం అని ఆర్థికమంత్రి హరీష్‌రావు పదే పదే చెప్పినా దుబ్బాక ఓటరు మాత్రం గులాబీ పార్టీ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఏదేమైనా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం సానుభూతి కూడా టీఆర్ఎస్‌కు కలిసి రానంత వ్యతిరేకత ఆ పార్టీపై ఉందన్నది స్పష్టమైంది.