ఎడిట్ నోట్: ‘కొనుగోలు’ కథ కొనసాగింపు..!

-

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతుంది. రోజుకో ట్విస్ట్ అన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలు కథ నడుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఓ వైపు కోర్టులో, మరో వైపు రాజకీయంగా రచ్చ జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి..కొనుగోలుకు సంబంధించి ఫామ్‌హౌస్‌లో జరిగిన బేరాలని వీడియోలని విడుదల చేశారు.

అలాగే అమిత్ షా, జే‌పి నడ్డా, బి‌ఎల్ సంతోష్‌లు టార్గెట్‌గా కేసీఆర్ ప్రెస్ మీట్ నడిచింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్‌కు కౌంటరుగా బీజేపీ కూడా తమదైన శైలిలో లాజిక్‌లతో ముందుకొచ్చింది. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు..కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అసలు ‌ఓ‌ఎల్‌ఎక్స్‌లో కూడా పనిచేయని ఎమ్మెల్యేలని తాము కొనడం ఏంటని? అయినా 2014 నుంచి కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే అని, అసలు ఏ మాత్రం నైతిక విలువలు లేని కేసీఆర్ తమ గురించి మాట్లాడటం కామెడీగా ఉందని కౌంటర్ ఇచ్చారు.

ఇక లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళుతుందని, అందుకే ఇప్పుడు కేసీఆర్..ఇలా కొనుగోలు కథలు చెబుతున్నారని బండి ఫైర్ అయ్యారు. ఇంకా బండి సంజయ్..కేసీఆర్ ప్రెస్ మీట్‌కు పూర్తి స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఇలా పార్టీల మధ్య మాటల దాడి జరుగుతుంది. అలాగే ఈ కేసుపై కోర్టులో కూడా ఫైట్ నడుస్తోంది. ఈ కేసుపై విధించిన స్టేని ఎత్తేయాలని, పట్టుబడిన ముగ్గురు వ్యక్తులని రిమాండ్‌కు ఇవ్వాలని ఏసీబీ కోర్టుని కోరింది.

తమ పార్టీని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో, జాతీయ ఇష్యూగా మారడంతో ఈ కేసుని సి‌బి‌ఐకి ఇవ్వాలని బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. అటు పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు సైతం..ఈ కేసుని సి‌బి‌ఐకు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారు. అటు ముగ్గురు నిందితులు సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు..రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఈ కేసుని సి‌బి‌ఐకి ఇవ్వాలని కోరారు. అటు సుప్రీం, ఇటు హైకోర్టులో ఈ కేసు నడుస్తోంది.

కేసులో మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుని సుప్రీం ఆదేశించింది..అలాగే ట్రయల్ కోర్టులో బెయిల్ అప్ప్లై చేసుకునే అవకాశం నిందితులకు ఇచ్చింది. ఇటు ముగ్గురు నిందితులని రిమాండ్ ఇవ్వాలని, స్టే ఎత్తేయాలని ఏసీబీ.. హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్‌ని కొట్టేసి..7వ తేదీ వరకు స్టే పొడిగించింది. అలాగే ఈ కేసుని సి‌బి‌ఐకి ఇవ్వాలని అంశంపై సోమవారం విచారించే ఛాన్స్ ఉంది.

ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగానే కేసీఆర్…వీడియోలని బయటకు చూపించారని, ఇది న్యాయ వ్యవస్థని ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని, ఇది దేశానికి సంబంధించింది కాబట్టి, ఈ కేసుని సి‌బి‌ఐకి అప్పగించాలని తీన్మార్ మల్లన్న హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కూడా సోమవారం విచారించే ఛాన్స్ ఉంది. మొత్తానికి రాజకీయంగానే కాకుండా, కోర్టులో కూడా కొనుగోలు కథపై ట్విస్ట్‌లు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news