ఏపీలో రాజకీయాలు ఎప్పుడు రణరంగాన్ని తలపిస్తూనే ఉంటాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మధ్య యుద్ధం ఓ స్థాయిలో జరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు..చేతల యుద్ధం కూడా నడుస్తోంది. అంటే దాడుల వరకు రాజకీయం వెళ్లింది. ఎవరికి వారు పై చేయి సాధించాలనే క్రమంలో రాజకీయాన్ని హాట్ హాట్ గా నడిపిస్తున్నారు.
ఎప్పుడు ఏదొక అంశం విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది. ఇటీవల ఓట్ల అక్రమాల విషయంలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ..అధికార బలాన్ని వాడుతూ..సచివాలయ ఉద్యోగులని, వాలంటీర్లని ఉపయోగించి..టిడిపి సానుభూతి పరుల ఓట్లని తొలగించడం..వైసీపీకి అనుకూలంగా దొంగ ఓట్లు చేర్పించడం చేస్తున్నారని టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయని కమిషన్ తేల్చి..టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఇద్దరు అధికారులని సస్పెండ్ కూడా చేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల అక్రమాలపై టిడిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు..వైసీపీ దొంగ ఓట్లు సృష్టించడం, టిడిపి తో పాటు వేరే పార్టీల ఓట్లని తొలగిస్తుందని ఫిర్యాదు చేశారు. ఇదే తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే ఈ దొంగ ఓట్లకు నాంది పడిందని , అప్పుడు జరిగిన కొన్ని అంశాలపై ఫిర్యాదు చేశారు.
అలాగే ఓటరు కార్డుని…ఆధార్‌కు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ని బాబు స్వాగతించారు. అయితే ఇలా రెండు పార్టీల నేతలు నువ్వు దొంగ అంటే..నువ్వు దొంగ అని అనుకుంటున్నాయి. దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఓటర్ల లిస్టులో అక్రమాలు చేసేది ఎవరు? దొంగ ఓట్లు సృష్టించేది ఎవరు అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఎవరేం చేసిన ప్రజా క్షేత్రంలో గెలుపోటములు నిర్ణయించేది ప్రజలే..ఇంకా అంతా వారి చేతుల్లోనే ఉంది.