మంచి కొంచెమే కావొచ్చు. కానీ ఆ పరిణామాలను ప్రేమించాలి. మంచి ఎక్కువే కావొచ్చు. కానీ తరువాత చేయాల్సిన కర్తవ్యం వదిలిపోకూడదు. కేసీఆర్ ప్రభుత్వం మంచే చేస్తుంది. ఎక్కువ మంచి చేశామని చెబుతోంది. దాంతో వాస్తవాలు అన్నవి కనుమరుగు అయిపోతున్నాయి. ఫలితంగా బంగారు తెలంగాణ అన్నది పుస్తకాలకే పరిమితం అవుతున్నాయి. కన్నీటి పర్యంతం అవుతున్న బాల్యం, గుక్కెడు ఆహారం దొరకని శైశవ దశ మన బంగారు తెలంగాణలో సాక్షాత్కారం కావడం ఏమంత మంచిది కాదు.
పాలకులకు శ్రేయోదాయకం అంత కన్నా కాదు. నీళ్లు నిధులు నియామకాలు అన్నవి ఎలా ఉన్నా ముందు రేపటి తరం ఎదుగుదలకు, వారి ఉన్నతికి కాస్తయినా మంచి దారి ఒకటి వేయాలన్న తలంపు మన పాలకుల్లో లేకపోవడం శోచనీయం అని ప్రజా సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. తిండి కలిగితే కండ కలుగుతుంది.. కండ కలవాడే మనిషి అవుతాడు.. ఇవీ గురజాడ చెప్పిన మాటలు.. మరి! దేశాన్ని ప్రేమించే శక్తులు బాల్యాన్ని ఎందుకు ఈ విధంగా శాపగ్రస్తం చేస్తున్నారని?
ఆకలి కన్నీళ్లు లేని రాజ్యం ఒకటి కావాలి. అందుకు బంగారం తెలంగాణ ఓ తార్కాణం కావాలి. ఓ నిదర్శనం అయి ఉండాలి. అంత బాగా పాలన ఉండాలి. ఇలా కోరుకోవడం అత్యాశ కాదు కానీ మంచి పాలన అందించి, అందుకు సంబంధించి మంచి ఫలితాలు అందుకోవాలన్న తపన పాలకుల్లో ఉండాలి. ఇవేవీ లేని రోజు బంగారు తెలంగాణ నిర్మాణం కానీ సంబంధిత కలల సాకారం కానీ అత్యాశే అవుతుంది. అందుకే పాలనలో కొద్దిపాటి మార్పులు జరగాలి.
కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల వేదనలు వదిలి కేంద్రం పై పోరుకు మాత్రమే కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తుందన్న వాదన ప్రజా హక్కుల సంఘాల నుంచి వినిపిస్తోంది. తాజాగా నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే-5 లో అత్యంత నిరాశమయ ఫలితం ఒకటి వెలుగుచూసింది. పోషకాహార లోపంతో సతమతమవుతున్న చిన్నారులలో ఎక్కువ మంది తెలంగాణలోనే ఉన్నారని, దేశ వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ అత్యంత వెనుకబడి ఉందని, అథమ స్థానంలో ఉందని ఆ సర్వే పేర్కొంటుంది. దిగ్భ్రాంతికర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్నదే కీలకం.
– రత్నకిశోర్ శంభుమహంతి