ఎడిట్ నోట్ : ఆవిర్భావ‌మా ! ఆవేద‌నా ప‌ర్వ‌మా ?

-

ఉద్య‌మం సైద్ధాంతికం..ఉద్య‌మ స్వ‌రం అభౌతికం.. ఉద్య‌మాల నుంచి ఉద్య‌మాల వ‌ర‌కూ న‌డ‌యాడిన నేల‌ల్లో కొంద‌రు మాత్ర‌మే గొప్పగా స్థిరం అయిపోయారు అన్న దుఃఖం ఆ నేల బిడ్డ‌ల‌ది. త్యాగం ఒక‌రిది భోగం ఒక‌రిది అన్న భావ‌న కూడా ఇవాళ విప‌రీతంగా వినిపిస్తుంది. త్యాగాల తెలంగాణ వాకిట స్వ‌తంత్ర కాంక్ష నెర‌వేరినా కూడా ఇంకా అణిచివేత‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది అన్న‌ది ఓ ఆవేద‌న. ఈ వేళ లో ఈ హేల‌లో ఆ రోజు అమ‌రుల‌యిన బిడ్డ‌ల త‌ల్లులు ఎట్లున్న‌రు..? ఆ బిడ్డ‌ల త‌ల్లుల‌కు ఎవ‌రు ఏమిచ్చిన్రు ! ఆలోచిస్తే అంతా వింత ! ఆరా తీస్తే అంతా ఓ దిగ్బ్రాంతి.

క‌నుక పాల‌న‌లో ఇవాళ కొంద‌రికే అభివృద్ధి. కొంద‌రికే సంక్షేమం అన్న భావ‌న నుంచి ఒడ్డెక్కిన రోజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు మాత్ర‌మే తెలంగాణ అక్క‌ర‌కు వ‌చ్చింద‌న్న విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డిన రోజు. కార్పొరేట్ మాయాజాలం నుంచి తెలంగాణ బ‌య‌ట పడిన రోజు క‌ల‌లు పండిన రోజు బంగారు తెలంగాణ అన్న‌ది ఆవిష్కృతం కావ‌డం సుసాధ్య సంబంధ ప్ర‌క్రియ. ఈ ఉద‌యాన వీరుడికి అమ‌రుడికి వారి త‌ల్లుల‌కు పాదాభివంద‌నాలు.

కోటిన్నొక్క దేవ‌త‌లు న‌డ‌యాడే నేల.. తెలంగాణ.. ఒక ఉద్య‌మ గొంతుక‌కు మ‌రో ఉద్య‌మ గొంతుక తోడ‌యి గ‌ర్జించిన నేల తెలంగాణ. మంచి ఆశ‌యాలు ఉన్న స‌మాజానికి మంచి దృక్ప‌థాల ఉంటాయి. ఆ విధంగా ఆశ‌యంతో పాటే దృక్ప‌థంను కూడా త‌న పాట‌లో ఇముడ్చుకున్న నేల తెలంగాణ. ఇవాళ ఓ గొప్ప సంద‌ర్భం. కవుల‌కు, క‌ళాకారుల‌కు, ఉద్య‌మ బిడ్డ‌ల‌కు ముఖ్యంగా అణిచివేత‌ల్లో విప్ల‌వ స్వ‌రం వినిపించిన తెలంగాణ బిడ్డ‌ల‌కు వంద‌నాలు చెల్లించాలి. అమ‌రులకు వంద‌నాలు చెల్లించాలి. వీరుడా నీకు వంద‌నం.

ప్ర‌త్యేక తెలంగాణ క‌ల‌ను సాకారం చేసుకున్న రోజు. అన‌గా తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం. కేసీఆర్ క‌ల‌కు, ఉద్య‌మకారుల క‌ల‌కు ఇంకా సామాన్య ప్ర‌జ‌ల క‌ల‌కు, ఆకాంక్ష‌కు ప్ర‌తిరూపం ప్ర‌త్యేక తెలంగాణ. ఉద్య‌మించిన గొంతుకల తోడుతో కేసీఆర్ తో స‌హా ఎంద‌రో రాజ‌కీయ నాయ‌కులు చేసిన కృషి ఫ‌లితం. తెలంగాణ సాధ‌న ఒక్క కేసీఆర్ దే అని చెప్ప‌లేం కానీ ఆయ‌న కృషి కీల‌కం అని చెప్పాలి. ఆ రోజు ఎంద‌రో ఉద్య‌మ దారుల్లో అమ‌రులయ్యారు. ఎందరెంద‌రో ఆక‌లిద‌ప్పుల‌తో ఉద్య‌మాల్లో న‌డిచారు. జైలు బాట ప‌ట్టారు. కనుకనే తెలంగాణ అనే ఓ భావోద్వేగం నిలిచి గెలిచి గొప్ప విజ‌యాన్ని అందుకుంది. ఆ విజ‌యం ఒక్క కేసీఆర్ ది కాదు..కేసీఆర్ తో పాటు ఇంకొంద‌రిది కూడా !

సాధించిన తెలంగాణ‌లో వీరుల తెలంగాణ‌లో అమ‌రుల ఆశ‌యాల దివిటీల‌తో న‌డ‌యాడుతున్న తెలంగాణ‌లో సాధించాల్సింది ఎంతో ! నో డౌట్ ఎనిమిదేళ్ల‌లో సాధించింది త‌క్కువేం కాదు.ఇక‌పై కూడా సాధించాల్సింది. మంచి పేరు తెచ్చుకుని గొప్ప ఫ‌లితాల‌ను స్థిరం చేయాల్సిందీ ఉంది. ఆ విధంగా ఆక‌లి క‌న్నీళ్లు లేని తెలంగాణ కావాలి. బంగారు తెలంగాణ కావాలి. ఉద్య‌మ గొంతుకల‌ను గుర్తించి, గౌర‌వించే తెలంగాణ కావాలి. ఎనిమిదేళ్ల తెలంగాణ‌లో నీళ్లూ నిధులూ నియామ‌కాల సాధ‌న ఇంకా జర‌గాలి. ముఖ్యంగా రాజ‌కీయ జోక్యం అతిగా లేని పాల‌న కావాలి. పౌరుల‌కు మంచి జీవ‌నం ఇచ్చే రోజులు ఇంకొన్ని ముందున్న కాలంలో ఉన్నాయి అన్న భ‌రోసాతో పాల‌న సాగాలి. ఆ విధంగా బంగారు తెలంగాణ క‌ల‌ల‌కు ఓ రూపం రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news